ఇంటి పనులు.. బ్యాంకు ఖాతాలు.. సిమ్‌కార్డులు.. ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మత్తులు.. కొరియర్ సంస్థలు.. జీవిత/వాహనబీమా వంటి సేవలకు అంతర్జాలంలో కస్టమర్ కేర్ నెంబర్ వెతుకుతున్నారా..! అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే మీరు ఏ అవసరాలకు పరిశీలించారో.. అదే నెంబరు నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. నిజమని భావించి లావాదేవీలు ప్రారంభిస్తే.. బ్యాంకులో సొమ్మంతా ఖాళీ చేస్తారు. మోసపోయామని గ్రహించేలోపే సొమ్ము విత్‌డ్రా చేసుకుంటారు. సైబర్ ఉచ్చులో పడి సొమ్ము పోగొట్టుకుంటున్న బాధితుల్లో 90 శాతం ఐటీ నిపుణులు, 10 శాతం ఉన్నత విద్యావంతులు కావటం గమనార్హం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10 రోజుల్లో ఇదే తరహా ఫిర్యాదులు 30 వరకూ వచ్చాయి. సంక్రాంతి పండుగ వేళ ఇంటి సేవలు.. ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేర విభాగ పోలీసులు సూచిస్తున్నారు.
సొమ్ము ఎలా కాజేస్తారో తెలుసా..!
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ హవా నడుస్తోంది. మహానగరంలో పని ఒత్తిడి, ట్రాఫిక్ ఇబ్బందులతో ఉద్యోగులు, వ్యాపారులు సాంకేతికపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అధికశాతం ప్రజలు స్మార్ట్‌ఫోన్ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మొబైల్ మొరాయించినా, క్రెడిట్‌కార్డు సమస్య తలెత్తినా కస్టమర్‌కేర్ ద్వారా పరిష్కరించుకుంటున్నారు. అధికశాతం కస్టమర్‌కేర్ నెంబరును అంతర్జాలంలో వెతుకుతుంటారు. అదే సైబర్ మాయగాళ్లకు అవకాశంగా మారింది. అంతర్జాలంలో ఎవరెవరు ఏయే నెంబర్ల కోసం గాలించారనే సమాచారం సైబర్ నేరస్తులు సేకరిస్తున్నారు.
ఎనీడెస్క్, టైమ్ వ్యూయర్ యాప్‌లతో నగదు స్వాహా
స్పూఫింగ్ ద్వారా కస్టమర్ కేర్ నెంబర్లను ఉపయోగించి బాధితులతో మాట్లాడతారు. వారికి అవసరమైన సేవలకు కొద్దిమేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటూ మొబైల్ నెంబర్లకు సందేశం పంపుతారు. బాధితులు దాన్ని క్లిక్ చేయగానే వారు ఉపయోగించే సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ల్లో ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. బాధితులు నిర్వహించే ఆన్‌లైన్ లావాదేవీలన్నీ అటువైపు నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. నెట్‌బ్యాకింగ్ ద్వారా రూ.10-100 వరకూ పంపమంటారు. ఫోన్ ద్వారా ఒకరు మాట్లాడుతున్నపుడే, అతడి పక్కనే ఉన్న మరో సహాయకుడు ఎనీడెస్క్, టైమ్ వ్యూయర్ సాయంతో బాధితుల బ్యాంకు ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి వారి ఖాతాల్లోని నగదు మొత్తం స్వాహా చేస్తారు. బాధితులు గ్రహించేలోపే కొట్టేసిన సొమ్మును రెంటల్ యాప్ ద్వారా నగదుగా మార్చుకుంటారు.
రూ.10 పంపితే 20 లక్షలు కొట్టేశారు