హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన దిలీప్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి న్యూయార్క్‌లో ఉంటున్న స్నేహితుడు రమేశ్ ప్రొఫైల్ ఫొటో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి నాలుగు రోజుల క్రితం ‘హాయ్’ అంటూ సందేశం వచ్చింది. కొద్దిసేపటికే.. ‘మా చిన్నాన్న కొవిడ్‌తో ఆసుపత్రిలో ఉన్నాడు. రూ.2 లక్షలు అత్యవసరం. డబ్బు పంపితే మరుసటి రోజు జమ చేస్తా’ అంటూ మెసేజ్ వచ్చింది. అందుకు దిలీప్ అంగీకరించడంతో నగదు జమ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్ పంపించాడు. అందులోకి దిలీప్ రూ.1.98 లక్షలు పంపించాడు. కొద్దిగంటల తర్వాత రమేశ్‌కు ఫోన్ చేయగా.. తాను ఎలాంటి మెసేజ్ పంపించలేదని, ఆ వాట్సాప్ నంబర్ తనది కాదని చెప్పాడు. మోసపోయానని గుర్తించిన దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అమెరికాలో ఉంటున్న మీ స్నేహితులు, సన్నిహితుల ప్రొఫైల్ ఫొటో(డీపీ) ఉన్న నంబర్ నుంచి వాట్సాప్‌లో అత్యవసరంగా డబ్బు కావాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయా? తాము చెప్పిన ఖాతాలో నగదు జమ చేయాలంటూ కోరుతున్నారా? అమెరికా కేంద్రంగా సైబర్ నేరస్థులు పాల్పడుతున్న సరికొత్త మోసమిది. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సాప్ నంబర్లకు ఇలాంటి అభ్యర్థనలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, మరో ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని మోసం చేసి రూ.3.8 లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ మోసాల నేపథ్యంలో డబ్బులు కావాలంటూ వాట్సాప్ ద్వారా ఎవరు అభ్యర్థించినా.. నేరుగా ఫోన్ చేసి ధ్రువీకరించుకోవాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తున్నారు..
అమెరికాలో ఉంటున్న వ్యక్తుల వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలను సైబర్ నేరస్థులు సంపాదిస్తున్నారు. వారి కాంటాక్టు జాబితాలో ఉన్న 40-50 మందికి వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. తన స్నేహితుడు లేదా బంధువు ఆసుపత్రిలో ఉన్నాడని, తనకు డబ్బు పంపాలంటే సమయం సరిపోదని.. బ్యాంక్ ఖాతాకు సొమ్ము బదిలీ చేసి సాయం చేయాలని కోరుతున్నారు. సందేశాలు అందుకున్నవారు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. కేవలం చాటింగ్ మాత్రమే చేస్తున్నారు. తాను అత్యవసర పనుల్లో ఉన్నానని, తర్వాత మాట్లాడతానని దాటవేస్తున్నారు. అది నిజమేననుకుని నమ్మినవారు సైబర్ నేరస్థులు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఆ డబ్బు ఎప్పుడు తిరిగిస్తారో తెలుసుకునేందుకు ఒకటి, రెండు రోజుల తర్వాత ఫోన్ చేసినప్పుడు అసలు విషయం బయటపడుతోంది.
ఇలా చేస్తే సురక్షితం