వివాహం, బహుమతులు, ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌తో పాటు దిల్లీకి చెందిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి పలువురిని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. నైజీరియాలోని ఓజూజోర్ ప్రాంతానికి చెందిన ఫిడీలిస్ ఓబీనా కొంతకాలంగా దిల్లీలో నివసిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.
మాయమాటలు చెప్పి...
విదేశీయుడినని చెప్పుకుంటూ అమాయక యువతులకు వివాహం పేరుతో వల విసురుతాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చానని... బహుమతులు తీసుకువచ్చినట్టు సదరు మహిళలకు కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లు చేయిస్తాడు. బహుమతులను స్వాధీనం చేసుకున్నామని... పన్ను కడితే ఖరీదైన బహుమతులు కస్టమ్స్ నుంచి తిరిగి వస్తాయని నమ్మిస్తాడు. నిజమని నమ్మిన మహిళలు నైజీరియన్ ఖాతాలోకి సొమ్ము బదిలీ చేస్తారు. అనంతరం నేరస్థుడు ఫోన్ స్విచాఫ్ చేసుకుంటాడు. అతని నుంచి స్పందన రాకపోయేసరికి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా నైజీరియన్ మోసాలకు పాల్పడినట్టు సీపీ భగవత్ తెలిపారు. దిల్లీకి చెందిన కిరాణ దుకాణం యజమాని అనీల్‌కుమార్ పాండే ఇతనికి సహకరించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, 13 బ్యాంకు చెక్కు పుస్తకాలు, 65 డెబిట్ కార్డులు, 19 స్వైపింగ్ యంత్రాలు, రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మోసగాడి ఖాతాలోని రూ. 6 లక్షల 27 వేల రూపాయలను స్తంభింపజేశారు.
వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ రెట్టింపు లాభాలంటూ
మరో చోట ఆన్‌లైన్‌లో తక్కువ పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నేపాలీ సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌లోని ఖాట్మండుకు చెందిన తారా బహదూర్ గత కొంత కాలంగా దిల్లీలోని పాండవనగర్‌లో ఉంటున్నాడు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలంటూ ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు అమాయకులు ఇతను చేస్తున్న ప్రచారం నిజమని నమ్మి పెట్టుబడులు పెట్టారు. మోసపోయామని తెలిసి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చరవాణి, 2 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలోని మూడు లక్షల రూపాయలను పోలీసులు స్తంబింపజేశారు.
ఇదీ చదవండి:HIGH COURT: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం