తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber fraud: ఇన్సూరెన్స్​ పాలసీల పేరుతో వల.. రూ.15 లక్షలు స్వాహా.! - cyber cheating in the name of insurance money

భాగ్యనగరంలో సైబర్​ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్​ నేరస్తుల ఉచ్చులో పడి నగరవాసులు బలవుతున్నారు. డిస్కౌంట్​, ఆఫర్ల పేరుతో వారి నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తాజాగా నగరంలో ఇన్సూరెన్స్​ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి రూ.15 లక్షలు దోచేశారు. మరో చోట ఏటీఎం కేంద్రాల వద్ద తమ చేతివాటం ప్రదర్శించారు కొందరు దుండగులు.

cyber crime in hyderabad
హైదరాబాద్​లో సైబర్​ నేరాలు

By

Published : Jul 26, 2021, 8:20 PM IST

ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.15 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధురాలి(80)తో... ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్​ల పేరుతో ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. బోనస్ డబ్బుల ఆశ చూపి అందినకాడికి దోచుకున్నారు. ఆర్పీఐ, ప్రాసెసింగ్, సెబీ, వివిధ ఛార్జీల పేరుతో రూ.15.47 లక్షలు ఖాతాలో వేయించుకున్నారు.

అనంతరం వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు... ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్​ను అరెస్టు చేసి రిమాండు​కు తరలించారు. మరో నిందితుడు రస్టజీ పరారీలో ఉన్నట్లు... త్వరలోనే అతడిని పట్టుకుంటామని సైబర్​ పోలీసులు తెలిపారు.

కార్డులు స్వైపింగ్​

మరో చోట ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు మరిచిపోయిన కార్డులు దొంగిలించి.. స్వైపింగ్ మెషిన్ ద్వారా డబ్బులు వినియోగిస్తున్న ఇద్దరిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఫణీంద్ర.. కూకట్‌పల్లి సాయి ప్రశాంత్ నగర్​లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల‌ 3న ఉదయం హెచ్ఎంటీ హిల్స్​లోని ఓ ఏటీఎంలో తన డెబిట్ కార్డు ఉపయోగించి రూ.8,500 డ్రా చేశాడు. హడావుడిలో ఏటీఎం కార్డు అక్కడే మరిచిపోయాడు.

వైఫై కార్డులతో

అదే రోజు సాయంత్రం అతని ఖాతా నుంచి మూడు దఫాలుగా రూ.10,472 వినియోగించినట్లు ఫణీంద్ర చరవాణికి సందేశం వచ్చింది. దాంతో‌ ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కార్డును ఎక్కడ వినియోగించారు అనే కోణంలో కేపీహెచ్​బీ సీఐ లక్ష్మీ నారాయణ బృందం దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా ఎల్లమ్మబండకు చెందిన పోతురాజు కమల్ రాజు, కొంపల్లి మహేందర్​లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. వారు ఓ స్వైపింగ్ మెషిన్ తీసుకుని, ఏటీఎంలలో మరిచిపోయిన కార్డులకు.. వైఫై ఉన్నవాటితో డబ్బులు స్వైప్ చేసి జల్సాలు చేసేవారని సీఐ వివరించారు. నిందితుల నుంచి రూ.లక్షా పదివేల నగదు, 54 డెబిట్ కార్డులు, స్వైపింగ్ మెషిన్, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎవరైనా సరే డెబిట్, క్రెడిట్ కార్డులు పోయినా, ఎక్కడైనా మరిచిపోయినా వెంటనే వాటిని బ్లాక్ చేయాలని సీఐ లక్ష్మీ నారాయణ సూచించారు.

ఇదీ చదవండి:మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details