Cyber Cheaters Using Fake Accounts: మహేశ్‌బ్యాంకు ఉదంతంతో బినామీ ఖాతాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.12.90 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు ఆ డబ్బును 128 ఖాతాల్లోకి మళ్లించి తమ జేబుల్లో వేసుకున్నారు. ఈ ఖాతాలు ఎవరివో తెలుసుకోవడానికి పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. అనధికారిక అంచనా ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా వ్యక్తిగత ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం రూ.3,500 కోట్లు. మహేశ్‌బ్యాంక్ ఉదంతం తరహాలో లూటీ చేసింది దీనికి అదనం. గతంలో కొల్లగొట్టిన డబ్బును నేరగాళ్లు తమ ఖాతాలో జమచేసుకునేవారు. పోలీసులకు పట్టుబడే అవకాశం ఉండటంతో ఇప్పుడు నకిలీ ఖాతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకు అనేక పద్ధతులు అనుసరిస్తున్నారు.
కమీషన్ ఆశచూపి
విద్యార్థులు, నిరుద్యోగులకు కమీషన్ ఆశ చూపి ఖాతాలు తెరుస్తున్నారు. వీటిని ‘మ్యూల్ ఎకౌంట్లు’ అంటారు. అంటే వేరేవారి డబ్బుకు తాము బాధ్యత వహించడం అన్నమాట. తెలంగాణ అపెక్స్ బ్యాంకు నుంచి దోచుకున్న డబ్బును కొల్లగొట్టేందుకు ఇలానే కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ యువకుడి ఖాతాను వాడుకున్నారు. సాధారణంగా రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలకు చెందిన పేద రైతులు, నిరుద్యోగులకు చెందిన ఖాతాలను ఎక్కువగా వాడుకుంటుంటారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిలో అధికులు ఈ రాష్ట్రాలకు చెందిన వారే కాబట్టి అక్కడి ఖాతా అయితే డబ్బు డ్రా సులభమవుతుందని వీరి ఆలోచన. సైబర్‌నేరాలకు ఆలవాలమైన భరత్‌పూర్, ఝాంతార వంటి ప్రాంతాల్లో అయితే కమీషన్‌కు ఒప్పుకొన్న వారిని తమవద్దే పెట్టుకుంటారు. నేరం ద్వారా వచ్చిన డబ్బు వీరి ఖాతాలో పడగానే ఖాతాదారుడినే బ్యాంకు వద్దకు తీసుకెళ్లి సొమ్ము డ్రా చేసుకుంటారు. నేరం జరిగిందని గుర్తించిన వెంటనే బాధితులు 155260కు ఫోన్ చేస్తే సదరు లావాదేవీని నిలిపివేస్తున్నారు. అందుకే దోచుకున్న డబ్బుకు తక్షణమే డ్రా చేసుకునేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.
జన్‌ధన్ ఖాతాలు
ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం తెరిచిన జన్‌ధన్ ఖాతాలు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారాయి. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన నిరక్షరాస్యుల జన్‌ధన్ ఖాతాలను సైబర్ నేరాల కోసం వాడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం ఖాతా ఉపయోగించుకున్నందుకు డబ్బు వస్తుండటంతో వారు కూడా బోల్తా పడుతున్నారు. ఇది నేరం అన్న సంగతి కూడా వారికి తెలియదని, అందుకే దర్యాప్తు ఆధారంగా దోచుకున్న డబ్బు వీరి ఖాతాలో పడ్డట్లు గుర్తించినా వారిపై కేసులు నమోదు చేయడంలేదని, హెచ్చరించి వదిలేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.