Online fraud news: 'మీరు వాడుతున్నది సామ్సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కదా.. అదే కంపెనీ మీకొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఖరీదైన మరో స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకే పొందవచ్చు. మీ చిరునామా పంపిస్తే.. ఆ అడ్రస్‌తో పోస్టాఫీసుకు చరవాణి పంపిస్తాం. రూ. 1500 చెల్లించి ఫోన్ తీసుకోండి అన్నారు.' ఈ మాటలు నమ్మిన ఓ యువకుడు.. రూ. 15 వేల స్మార్ట్ ఫోన్ 1500కే వస్తుందని ఎగిరి గంతేశాడు. వెంటనే తన చిరునామా పంపించాడు. నాలుగు రోజుల తర్వాత పోస్టాఫీసు నుంచి కబురు వచ్చింది. అక్కడికి వెళ్లాడు. తీరా ప్యాకెట్ ఓపెన్ చేశాక.. అందులో ఉన్నది చూసి అవాక్కయ్యాడు.
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన బెస్త శ్రీనివాసులుకు(sweet box instead of smart phone ).. ఇటీవల ఒక నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. మీరు వాడుతున్న సామ్సంగ్ ఫోన్ కంపెనీ.. మీకొక బంపర్ ఆఫర్ వచ్చిందని ఆశ పెట్టాడు. ఆఫర్లో రూ. 15 వేల సామ్సంగ్ గెలాక్సీ జే 7 స్మార్ట్ ఫోన్ కేవలం 1500 కే వస్తుందని నమ్మబలికారు. చిరునామా చెబితే చరవాణి పంపిస్తామని చెప్పడంతో.. యువకుడు నమ్మి అడ్రస్ చెప్పాడు. పోస్టాఫీసులో రూ. 1500 చెల్లించి ఫోన్ తీసుకోవాలని సూచించారు.
శ్రీనివాసులుకు నిన్న.. పోస్టాఫీసు సిబ్బంది ఫోన్ చేసి చరవాణి వచ్చిందని తెలిపారు. దీంతో యువకుడు డబ్బులు తీసుకుని అక్కడికి బయలుదేరాడు. రూ. 1500 చెల్లించి ఆ పార్శిల్ తీసుకున్నాడు. పోస్టాఫీసు ఉద్యోగుల ఎదురుగానే ప్యాకింగ్ విప్పాడు. ఆ వెంటనే ఒక స్వీట్ బాక్స్ దర్శనమిచ్చింది. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ వచ్చిందనే సంతోషంలో పార్శిల్ ఓపెన్ చేసిన యువకుడికి స్వీట్ బాక్స్ కనిపించడంతో బాధితుడితో పాటు అక్కడున్న సిబ్బంది(cyber cheaters sent a sweet box ) కూడా అవాక్కయ్యారు. ఇలా జరిగిందేంటని సదరు కంపెనీకి ఫోన్ చేస్తే.. ఎటువంటి స్పందన లేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. ప్రలోభాలు, మాయమాటలకు తనలాగా ఎవరూ మోసపోవద్దని సూచించాడు.