సైబర్ కేటుగాళ్లు ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ (TS SPDCL CMD) రఘుమారెడ్డికి ఆగంతుకులు ఫేక్ కాల్ చేశారు. తాము జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం డాక్యుమెంట్స్ కావాలని అడగడంతో ఆయన తన ఆధార్, పాన్ కార్డులను వారికి పంపించారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వర్క్ ఫ్రం హోం జాబ్ పేరుతో..
వర్క్ ఫ్రం హోం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు 1 .80 లక్షలను దండుకున్నారు. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన శ్రీ మణికంఠకి ఇంటి వద్ద నుంచి పని చేసే ఉద్యోగం ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి వారు అడిగిన డాక్యుమెంట్లు.. సెండ్ చేశాడు. జాబ్ కోసం పలు రకాల ఛార్జీల పేరుతో 1.80 లక్షలు ఆన్లైన్ ద్వారా కేటుగాళ్లు రాబట్టుకున్నారు. అనంతరం వారి ఫోన్ చేస్తే కలవకపోవడంతో.. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు