Crypto Currency Fraud : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో అధిక లాభాలంటూ వచ్చే ప్రకటనలపై క్లిక్ చేయగానే వాట్సప్ గ్రూపులో యాడ్ చేసేందుకు రీడైరెక్ట్ అవుతుంది. అందులో వందల సంఖ్యలో కస్టమర్లు సభ్యులుగా ఉంటారు. తాను ఇంత పెట్టుబడి పెట్టానని.. ఊహించిన మొత్తం కంటే ఎక్కువగా లాభాలు వచ్చాయంటూ సందేశాలు పెడుతుంటారు. అవి చూసి నిజమేనని స్పందిచారంటే మీ ఖాతాలో డబ్బులు లూఠీ అయినట్లే. పెట్టుబడి పెడతామని పోస్ట్‌చేస్తే నిర్వాహకుడు లైన్‌లోకి వస్తాడు.
క్రిప్టో కరెన్సీకి చెందిన యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తాడు. అందులో వివిధ రకాల క్రిప్టో కరెన్సీ ట్రేడ్ అవుతూ కనిపిస్తాయి. తొలుత తక్కువ మొత్తం పెట్టి క్రిప్టో కరెన్సీ కొంటే లాభం వచ్చినట్లు వ్యాలెట్‌లో కనిపిస్తుంది. లాభం చూడగానే అధిక మొత్తంలో పెట్టుడులు పెట్టగానే వ్యాలెట్ మాయం అవుతుంది. విత్ డ్రా చేసుకునే ఆప్షన్‌ను సైబర్ నేరగాడు యాప్‌లో బ్లాక్ చేస్తాడు. మొబైల్ ఐపీ అడ్రస్ పని చేయకుండా సైబర్ నేరగాళ్లు బ్లాక్ చేస్తారు. బాధితుడు తేరుకొని ఫిర్యాదు చేసేలోపే బాధితుడు బదిలీ చేసిన నగదు వివిధ ఖాతాల్లోకి చేరిపోతుంది.
రెండు నెలల క్రితం అధిక పెట్టుబడులు వస్తాయని.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాధితుడి నుంచి ఇదే తరహాలో రూ.86 లక్షలు కాజేశారు. బంగాల్‌లో ఉన్న ప్రధాన నిందితుడు చోటా భాయ్ నుంచి రూ.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే బాధితుడు టెలిగ్రామ్‌లో ప్రకటన చూసి పలు దఫాలుగా రూ.27 లక్షలు పెట్టాడు. అందులోంచి ఒక్క రూపాయి తీసుకునేందుకూ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.