hair illegal transport: దిల్లీ కేంద్రంగా డోకిపే, లింక్‌యున్ కంపెనీలు వివిధ అక్రమాలకు పాల్పడుతున్నాయి. జుట్టు అక్రమ రవాణాతో పాటు.. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చిన నగదును తెలుగురాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీలకు బదిలీ చేసి.. విదేశీమారక ద్రవ్యాన్ని హవాలారూపంలో చైనాకు తిరిగిపంపుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఈడీ ఆయా ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల్లోనే రూ.217కోట్ల జుట్టును హైదరాబాద్ నుంచి మయన్మార్‌కు అక్రమంగా రవాణా అయ్యిందని.. 15 మంది వ్యక్తులు, కంపెనీలకు సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒక్క వెంట్రుక లాగితే..
online gaming fraud: ఆన్‌లైన్ గేమింగ్‌లు నిర్వహిస్తున్న చైనా కంపెనీల కార్యకలాపాలపై ఈడీ అధికారులు ఏడాది నుంచి పరిశోధన కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి చైనాకు జుత్తు ఎగుమతి చేస్తున్న ఓ వ్యాపారి ఖాతాలో కొద్దినెలల క్రితం రూ.72లక్షల నగదు జమయ్యింది. ఆయన ఎగుమతి చేసిన జుట్టుకు సరిపడా నగదు వచ్చినా.. అది చైనా నుంచి కాకుండా దిల్లీలోని డోకిపే, లింక్‌యున్ సంస్థల నుంచి వచ్చినట్టు గుర్తించారు. అప్పటి నుంచి ఆ రెండు సంస్థల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం కోల్‌కతాకు చెందిన హ్యుమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పోర్ట్స్ సంఘం ప్రతినిధులు తమ సంఘంలో లేని కొన్ని కంపెనీలు అక్రమంగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌కు జుట్టు పంపుతున్నాయంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. నాలుగు నెలల క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్, తణుకులోని పదిహేను కంపెనీల లావాదేవీలను పరిశీలించగా.. అక్రమాలు జరిగినట్టు తేలింది.