తెలంగాణ

telangana

ETV Bharat / crime

2021 నేరాల గణాంకాలు విడుదల, సైబర్ క్రైమ్​లో మనమే టాప్ - Hyderabad Crime News

crime rate in Telangana 2021 దేశవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సైబర్‌ నేరాలు, ఆహార కల్తీ వంటి కేసుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆర్థిక నేరాల్లో రెండోస్థానం, వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో ఉంది. 2021లో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాలను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది. 2021లో రాష్ట్రంలో లక్షా 46 వేల 131 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

Telangana Crime Rate 2021
Telangana Crime Rate 2021

By

Published : Aug 29, 2022, 6:56 AM IST

crime rate in Telangana 2021: రాష్ట్రంలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019లో 2,691, 2020లో 5,024 కేసులు నమోదు కాగా.. అంతకముందు ఏడాదితో పోలిస్తే 2021లో ఏకంగా 10,303కు కేసులు ఎగబాకాయి. దేశంలో 52,430 కేసులు నమోదు కాగా.. అందులో 20 శాతం తెలంగాణలోనే కావడం.. పెరుగుతున్న సైబర్‌ నేరాల తీవ్రతను తెలియజేస్తుంది. రెండోస్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ 8,829గా ఉంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు 2,180 నమోదు కాగా.. ఓటీపీ మోసాలు 1,377, మార్ఫింగ్‌ 18, ఫేక్‌ ప్రొఫైల్‌ తయారీ 37, ఏటీఎం - 443 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్‌ నేరాలు కూడా ఎక్కువగా తెలంగాణలోనే 8,690 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలు 2019లో 11,465, 2020లో 12,985 కాగా.. 2021లో ఏకంగా 20,759కి పెరిగాయి. దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉంది.

Hyderabad Crime News : రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. 2021లో దేశవ్యాప్తంగా లక్షా 64 వేల 33 బలవన్మరణాలు జరిగాయి. వీటిలో 4 వేల 806 మంది రైతులు ఉండగా.. మరో 5 వేల 121 మంది కౌలు రైతులు, 5 వేల 563 మంది రైతు కూలీలు మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 2,429 మంది రైతులు, 1,329 మంది కౌలు రైతులు, 1,424 మంది రైతు కూలీలు బలవన్మరణం చెందారు. కర్ణాటక, ఏపీ రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 303 మంది రైతులు, 49 మంది కౌలు రైతులు, ఏడుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.

Telangana Crime Rate 2021 : వృద్ధులపై దాడుల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6,190 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్​లో 5,273, తెలంగాణలో 1,952 కేసులు నమోదయ్యాయి. దళిత మహిళలను అవమానించిన కేసులు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ కేసులు 151 నమోదు కాగా.. అత్యధికంగా ఏపీలో 83, తెలంగాణలో 21 కేసులు నమోదయ్యాయి.

లైంగిక అక్రమ రవాణా కేసులు కూడా తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో లైంగిక అక్రమ రవాణా కేసులు 2083 నమోదు కాగా.. తెలంగాణలో అధికంగా 347 కేసులున్నాయి. అక్రమ రవాణా కేసుల్లో 1050 మంది నిందితుల అరెస్టుతో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కుటుంబ సమస్యలతో బలవన్మరణాల కేసుల్లో అత్యధికంగా ఒడిశాలో నమోదు కాగా.. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. దేశంలో 2020తో పోల్చితే 2021లో బలవన్మరణాలు పెరిగాయి. 2021లో అధికంగా 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని తేలింది.

రోడ్డు ప్రమాదాల్లో 10.8 శాతం పెరుగుదల..:రోడ్డు ప్రమాదాల్లో సింహభాగం తమిళనాడులో జరుగుతున్నాయి. 2020తో పోల్చితే 2021లో 58 శాతం అక్కడ పెరిగాయి. యూపీ (15.2 శాతం), తెలంగాణ (10.8 శాతం), ఏపీ (9.5 శాతం), పంజాబ్‌ (9.1 శాతం) అధికమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మహిళలను వేధించిన కేసుల్లో రాజీలు..

* మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానాల్లో రాజీ పడుతున్న ఉదంతాలూ తెలంగాణలోనే అధికం. 4955 ఉదంతాల్లో రాజీ కుదిరింది.

* మహిళల్ని సంజ్ఞలు, వ్యాఖ్యలతో వేధించే ఘటనలు తెలంగాణ (నాలుగో స్థానం)లో 775 నమోదయ్యాయి.

* రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా కేసులు 154 నమోదయ్యాయి. దేశంలో ఇది నాలుగో స్థానం.

* 391 జస్టిస్‌ జువైనల్‌ చట్టం కేసులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.

* బాల కార్మికుల చట్టం కింద 224 కేసుల్లో 305 మంది బాధితులు దొరికారు. ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 613 కేసులు నమోదయ్యాయి.

* చిన్నారులకు సంబంధించిన చట్టాల కింద 3370 కేసులతో తెలంగాణ నాలుగో స్థానం ఉంది.

వదంతుల వ్యాప్తిలోనూ రాష్ట్రానికి సాటిలేదు..

* వదంతులు సృష్టించడం, వ్యాప్తి చేయడంలో తెలంగాణ టాప్‌లో ఉంది. దేశంలో 882 కేసులు నమోదవగా తెలంగాణలో 218 కేసులు ఉన్నాయి.

* పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల్లో తెలంగాణ (31 కేసులు)ది మూడో స్థానం. బిహార్‌ (97), మధ్యప్రదేశ్‌ (46) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

*రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో మధ్యప్రదేశ్‌ (29421 కేసులు), తమిళనాడు (18896) తర్వాత తెలంగాణ (10761)ది మూడో స్థానం.

అభియోగపత్రాలేవీ..

* తెలంగాణలో సైబర్‌ నేరాలు పెచ్చుమీరుతున్నా అభియోగపత్రాల నమోదులో మాత్రం పోలీసులు వెనకబడే ఉన్నారు. ఈ విషయంలో దేశవ్యాప్త సగటు 33.6 శాతముంటే తెలంగాణది కేవలం 16.4 శాతమే.

* ఆర్థిక నేరాల్లో తెలంగాణ పోలీసులు 60.1 శాతం కేసుల్లో అభియోగపత్రాలు నమోదు చేశారు.

* వృద్ధులను ఫోర్జరీ తదితర పద్ధతుల్లో మోసగించిన కేసులు మహారాష్ట్రలో 1150 ఉండగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో 419 నమోదయ్యాయి.

* వృద్ధులను దొంగలు దోచుకున్న ఘటనలు మహారాష్ట్ర (1206) తర్వాత తెలంగాణలో (298)నే అధికంగా ఉన్నాయి. దోపిడీలు సైతం మహారాష్ట్రలో 13.. తెలంగాణలో 8 నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details