నీరజ్ హత్యకేసులో ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేసి.... నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌ను 10 రోజుల క్రితం బేగంబజార్‌లో కత్తులతో పొడిచి చంపారు. అతడి భార్య సంజన, కుటుంబ సభ్యులను... ఆనంద్ పరామర్శించారు.
బేగంబజార్‌కు చెందిన మార్వాడి మాలీసమాజ్, యాదవ్ సమాజ్‌కు చెందిన పెద్దలతోనూ పోలీస్ కమిషనర్ చర్చించారు. నీరజ్ హత్య అనంతరం ఇరుకులాలు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో వారిని కమిషనర్ హెచ్చరించారు.
'' నీరజ్ హత్య కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశాం. నీరజ్ హత్య కేసులో ఇరుపక్షాల పెద్దలను హెచ్చరించాం. ప్రేమజంటలను హత్య చేసి పగ తీర్చుకోవడం సరికాదు. పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని పెద్దలను కోరుతున్నాం. నీరజ్ హత్య కేసు విచారణ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.''- సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్