తెలంగాణ

telangana

ETV Bharat / crime

కన్నవారిని చూసేందుకు వస్తూ.. రెప్పపాటులో మృత్యుఒడికి..

Road Accident: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికి ఒకసారైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను చూసి.. వారితో కొన్నిరోజులు సంతోషంగా గడిపి వెళ్తుంటారు. రెండు మూడేళ్లుగా కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో కన్నవారిని చూసేందుకు ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో మృత్యువు వేటాడింది. రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులను కాటేసి వారి బిడ్డలను అనాథలను చేసింది. ఈ దుర్ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది.

couple died and three severely injured in road accident
couple died and three severely injured in road accident

By

Published : Apr 28, 2022, 10:10 AM IST

Road Accident: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. విదేశాల నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చిన ఓ కుటుంబం... స్వగ్రామానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు... దంపతులను కబళించింది. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడి... ప్రాణాలతో బయటపడ్డారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడానికి భరధర్‌.. రజితను ప్రేమవివాహం చేసుకుని.... ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వీరికి కుమార్తె భవజ్ఞ (9), కుమారుడు ఫర్విత్‌(6) ఉన్నారు.

ఏడాదికి ఒకసారైనా ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి సంతోషంగా గడిపి వెళ్తుంటారు. కరోనా వల్ల.. రెండు మూడేళ్లుగా స్వదేశానికి రాలేకపోయారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో కన్నవారిని చూసేందుకు ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో మృత్యువు వారిని వెంటాడింది. ఘటనలో.. దంపతులిద్దరూ మరణించగా.. పిల్లలు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

రజిత తండ్రి ఆరు నెలల క్రితం చనిపోయారు. అప్పుడు రాలేకపోయిన వీరు.. స్వగ్రామానికొచ్చి అందరినీ చూడాలనుకొని ఈనెల 25న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ షాపింగ్‌, ఇతర పనులు ముగించుకొని మంగళవారం రాత్రి రెడ్డిగూడెం బయల్దేరారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమాంబరధర్‌ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారులు భవజ్ఞ, ఫర్విత్‌తో పాటు డ్రైవర్‌ తిరుపతిరావుకు గాయాలయ్యాయి.

పోలీసులు మృతదేహాలు, క్షతగాత్రులను సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ తిరుపతిరావును విజయవాడకు తరలించారు. బుధవారం సాయంత్రం రెడ్డిగూడేనికి చేరుకున్న మృతదేహాలను చూసిన కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. కన్నబిడ్డలు ఇంటికి వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. మృతుడి తండ్రి సుబ్బారావు, తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details