తెలంగాణ

telangana

ETV Bharat / crime

వ్యవసాయ శాఖలో అవినీతి జలగ సస్పెన్షన్​ - telangana latest news today

రాష్ట్రంలో మరో అవినీతి అధికారిపై వేటు పడింది. వ్యవసాయ శాఖలో ఉంటూ ఏడు కోట్ల రూపాయల దొంగ బిల్లులు స్వాహా చేశారు. పత్తి పంటలో రైతులకు శిక్షణ ఇవ్వాల్సిన నిధులు సైతం స్వాహా చేశారు. విషయం తెలిసి అధికారులు ట్రాన్స్​ఫర్​ చేసినా ఆయన తీరు మారలేదు. మళ్లీ అదే ప్రాంతానికి పోస్టింగ్​ వేయించుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఆ ఘటనపై తాజాగా వ్యవసాయ శాఖ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. అతనిని విధుల నుంచి తప్పించారు.. అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్​లో చోటుచేసుకుంది.

corruption-leech-in-the-department-of-agriculture
వ్యవసాయ శాఖలో అవినీతి జలగ సస్పెన్షన్​

By

Published : Mar 6, 2021, 5:36 AM IST

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి.మంగీలాల్​పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. లింగాకర్షక బుట్టల కుంభకోణం కేసులో అతనిని సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రైతు శిక్షణ కేంద్రం ఏడీఏగా డిప్యూటేషన్​పై పనిచేస్తున్న మంగీలాల్​పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

వ్యవసాయ పంటల సాగు, చీడ పీడలు, ఇతర యాజమాన్యం చర్యలపై ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా... అందుకు భిన్నంగా దొంగ బిల్లులు రాసి నిధులు కాజేశారన్న విమర్శకులు కూడా అనేకం వచ్చాయి. 2018లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఏడీగా పనిచేస్తున్న సమయంలో.. పత్తిలో పురుగుల ఉద్ధృతి నివారణ కోసం ఓ సంస్థతో కుమ్ముక్కై లింగార్షక బుట్టల పంపిణీలో మంగీలాల్​ అక్రమాలకు పాల్పడ్డారు.

దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్.. అతనిని వ్యవసాయ శాఖకు సరేండర్ చేశారు. ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేసి మళ్లీ కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ సంపాదించారు. ఈ క్రమంలో ఆ కేసు విచారణ పూర్తి చేసిన విజిలెన్స్ శాఖ వాస్తవాలు వెలుగులోకి తెచ్చింది.

గతంలో సైతం ఏటూరునాగారంలో పనిచేసినప్పుడు కోటి రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంగీలాల్​పై సస్పెన్షన్ వేటు వేసి విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణమే అరెస్టు చేయాలంటూ పోలీసు శాఖకు సిఫారసు చేసింది. మరోవైపు మంగీలాల్ ఓ ప్రజాప్రతినిధి సోదరుడు కావడం విశేషం.

ఇదీ చూడండి :లేఅవుట్ అనుమతికి రూ.13 లక్షలు డిమాండ్.. అనిశాకు చిక్కిన సర్పంచ్

ABOUT THE AUTHOR

...view details