తెలంగాణ

telangana

ETV Bharat / crime

Jubilee hills Gang Rape Case : సూత్రధారి కార్పొరేటర్ కుమారుడే - jubilee hills gang rape case latest updates

Jubilee hills Gang Rape Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారానికి సూత్రధారి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ కుమారుడేనని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు సాదుద్దీన్‌ మాలిక్‌ను గురువారం మధ్యాహ్నం కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు 6 గంటల పాటు అతణ్ని ప్రశ్నించారు కానీ అన్నింటికి పొడిపొడి సమాధానాలు చెప్పడంతో అతని నుంచి ఏ ఆధారాలు రాబట్టలేకపోయినట్లు పోలీసులు తెలిపారు.

Jubilee hills Gang Rape Case
Jubilee hills Gang Rape Case

By

Published : Jun 10, 2022, 7:14 AM IST

Jubilee hills Gang Rape Case : హైదరాబాద్‌లో ఓ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో కీలక ఆధారాలను జూబ్లీహిల్స్‌ పోలీసులు సేకరించారు. ఈ అత్యాచారానికి సూత్రధారి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ కుమారుడే అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. తన స్నేహితులతో మే 28న అమ్నీషియా పబ్‌కు వెళ్లిన కార్పొరేటర్‌ కుమారుడు అక్కడ బాధిత బాలికను మాటల్లో పెట్టి తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. గతంలో ఒకసారి కలిశావంటూ మాటలు కలిపాడు. ఇంటి వద్ద దించుతానంటూ నమ్మించి తీసుకెళ్లాడు. బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లిన తరువాత బాలిక బ్యాగు, కళ్లద్దాలు, సెల్‌ఫోన్‌ లాక్కొన్నారు. బాలికను కారులో కూర్చోబెట్టి నిందితులంతా బేకరీలో కావాల్సినవి తిని, సిగరెట్లు తాగారు. కారులో వస్తేనే ఆయా వస్తువులు ఇస్తామంటూ బెదిరించి ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లారు. నిర్జన ప్రదేశంలో వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

పొడిపొడిగా సాదుద్దీన్‌ సమాధానాలు
Jubilee hills Gang Rape Case Updates : కోర్టు అనుమతి ఇవ్వడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు చంచల్‌గూడ జైలులో ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఠాణాకు తరలించారు. పశ్చిమ మండల అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌లు సాదుద్దీన్‌ మాలిక్‌ను సుమారు ఆరు గంటలకుపైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అతడు పొడిపొడిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. మైనర్లతో ఉన్న సంబంధంపైనా ఆరా తీయగా సాదుద్దీన్‌ స్పందించలేదని సమాచారం.

మైనర్ల విచారణకు కోర్టు అనుమతి
నిందితులుగా ఉన్న మరో అయిదుగురు మైనర్లలో ముందుగా పట్టుబడిన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, సంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేత తనయుడు, కార్పొరేటర్‌ పుత్రునికి అయిదు రోజుల పాటు జువెనైల్‌ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు వీరిని పోలీసులు విచారించనున్నారు. మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఎమ్మెల్యే తనయుడు, బెంజ్‌కారు యజమాని కుమారుడి కస్టడీపై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ముగ్గురు మైనర్లను జువెనైల్‌ హోంలో న్యాయవాది సమక్షంలో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు విచారించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను బాధితురాలు గుర్తించేందుకు వీలుగా టెస్ట్‌ ఆఫ్‌ ఐడెంటిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. నేరాన్ని రుజువు చేసేందుకు కీలకమైన లైంగిక పటుత్వ పరీక్ష (పొటెన్సీ)ను వైద్య నిపుణులతో చేయించనున్నారు.

మైనర్లను మేజర్లుగా పరిగణించండి
కేసులో ఉన్న అయిదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును అభ్యర్థించనున్నారు. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని, ఈ మేరకు 2015లో జువెనైల్‌ జస్టిస్‌ చట్టానికి చేసిన చట్ట సవరణ గురించి వారు వివరించారు. 2019లో చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేసిన 17 ఏళ్ల బాలుడికి జువెనైల్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. అదే తరహాలో జూబ్లీహిల్స్‌లో బాలికపై మైనర్లు అత్యాచారానికి పాల్పడటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాము నేరం చేస్తున్నామన్న విచక్షణతోనే ఇదంతా చేశారని పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details