అంతిమయాత్ర సంప్రాదాయాలపై కొవిడ్.. విలయం సృష్టిస్తోంది. దూరమైన ఆత్మీయుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోవడం తప్ప చివరి క్షణాల్లో స్పర్శించే అవకాశం కూడా చిక్కడం లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కర్మక్రతువు జరపలేదని పిల్లలు, జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసినవాడిని కాస్త కదల్చాలని తపించే అర్ధాంగి, తోడబుట్టినవాడు చనిపోతే పాడె మోసే నలుగురిలో లేకపోయామన్న రక్తసంబంధీకుల ఆత్మఘోష విషాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. తీరని వేదన వారి మనసు పొరల్లో గూడు కట్టుకుంటోంది. అందరూ ఉండీ చివరి క్షణాల్లో ఆ నలుగురినీ డబ్బులిచ్చి సమకూర్చుకునే దయనీయ పరిస్థితి కనిపిస్తోంది.
ఒంటరి పయనం
కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి పట్టణాల్లో స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వస్తున్నాయి. గ్రామాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా సోకిందని తెలిస్తే.. సాయంగా ఉండాల్సిన బంధువులు ఇంటి వైపు తొంగిచూడటం లేదు. ఇంట్లో పనులు చేయడం, ఇతర అనుబంధాలు ఉన్నవారు కూడా రావడం లేదు. అప్పటివరకు బంధువులు తోడున్నారన్న ధీమాతో ఉన్న వారు ఒంటరి అవుతున్నారు. ఉపాధి వేటలో దూర ప్రాంతాలకు వెళ్లిన పిల్లల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అందరూ ఉన్నా అనాథలైన శవాలకు కొన్నిచోట్ల నలుగురైదుగురు సభ్యుల బృందం వచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తోంది. ఖననానికి రూ.15 వేలు, దహన సంస్కారాలకు రూ.30 వేలను వారు తీసుకుంటున్నారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో ఒక్కోచోట నాలుగైదు బృందాలు ఈ కార్యక్రమాన్ని ఉపాధిగా ఎంచుకున్నాయి.