Attack on AE in karepally: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కాంట్రాక్టు ఉద్యోగి వీరన్న చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంతో విద్యుత్ శాఖ ఏఈ విజయ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో విద్యుత్ శాఖ ఏఈ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఎలాగోలా చివరికి వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే: గుంపెళ్ల గూడెంకు జర్పుల వీరన్న (30) కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి పక్కన మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్తంభంపై ఉండగానే విద్యుత్ ప్రసరించడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. వీరన్నను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. విద్యుదాఘాతానికి గురైన వీరన్నను బతికించేందుకు వైద్యసిబ్బంది శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.