తెలంగాణ

telangana

ETV Bharat / crime

స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేసిన వైద్యులు.. రూ.15 లక్షలు జరిమానా

Nellore District Consumer Forum: కాన్పు కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేరింది ఓ మహిళ. ఆమెకు శస్త్రచికిత్స చేసిన తరువాత కడుపులో దూదిని వదిలేశారు వైద్యులు. వారి నిర్లక్ష్యానికి నరకయాతన అనుభవించింది ఆ మహిళ. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల నుంచి తమకు రూ.19.90 లక్షల పరిహారం ఇప్పించాలని వినియోగదారుల కమిషన్‌లో ఆమె భర్త కేసు వేశారు. కాటన్‌ స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేశారని నిర్ధారణకు వచ్చిన కమిషన్​.. రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Consumer Forum
Consumer Forum

By

Published : Oct 27, 2022, 8:40 PM IST

Nellore District Consumer Forum: మహిళకు వైద్యం చేయడంలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆ మహిళకు రూ.15 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ప్రెసిడెంట్‌ జింకారెడ్డి శేఖర్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. ఈ మేరకు తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అదే జిల్లా ఏఎస్‌పేటకు చెందిన ఫాతీం భార్య షేక్‌ రశీలభాను కాన్పు కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేరారు. 2015 నవంబరు 27న శస్త్రచికిత్స చేశారు. డిశ్చార్జీ అయి ఇంటికెళ్లిన తర్వాత ఆమెకు కడుపునొప్పి ప్రారంభమైంది. హైదరాబాద్‌, విజయవాడ, వేలూరు తదితర నగరాల్లోని తొమ్మిది ఆసుపత్రుల్లో దాదాపు రెండేళ్లు చికిత్స పొందినా ఫలితం కనిపించలేదు.

చివరకు 2017 జూన్‌ 17న నెల్లూరు కిమ్స్‌ (బొల్లినేని) ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి కడుపులో 18×17 సెంటీమీటర్ల పరిమాణం గల దూది ఉందని గుర్తించి శస్త్ర చికిత్స చేసి తొలగించారు. తమకు నష్టం కలిగించిన వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల నుంచి తమకు రూ.19.90 లక్షల పరిహారం ఇప్పించాలని నెల్లూరు వినియోగదారుల కమిషన్‌లో రశీల కేసు వేశారు.

కాన్పునకు సంబంధించి సీఎంసీ ఆసుపత్రి స్పాంజ్‌ అకౌంట్‌ రికార్డును వినియోగదారుల కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. ఒక కాటన్‌ స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేశారని నిర్ధారణకు వచ్చి రశీలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని సీఎంసీ ఆసుపత్రి యాజమాన్యాన్ని వినియోగదారుల కమిషన్‌ ప్రెసిడెంట్‌ జింకారెడ్డి శేఖర్‌ ఆదేశించారు. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించకపోతే తీర్పు వెలువడిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details