లాక్‌డౌన్ సమయంలో పిల్లల కోసం పాలు కొనేందుకు బయటకు వచ్చిన ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ విచక్షణా రహితంగా కొట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం స్థానికంగా నివసించే కరణ్ పాలకోసం బయటకు వచ్చారు. తిరిగి ఇంటికి బయలుదేరే సమయంలో కానిస్టేబుల్ కంట పడ్డారు. దీంతో కానిస్టేబుల్ కోపోద్రిక్తుడై బయటకి ఎందుకొచ్చావు అంటూ నిర్దాక్షిణ్యంగా కరణ్‌పై లాఠీతో దాడికి దిగాడు. తాను పాల కోసం వచ్చానని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా బయట ఎలా తిరుగుతున్నావని కొట్టాడు. కరణ్‌కు తీవ్రగాయాలు కాగా ఏమిటీ దారుణం అని ప్రశ్నిస్తే మళ్లీ చితకబాది తన ప్రతాపాన్ని చూపాడు.