తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువతీయువకుల వీడియో తీసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే? - హైదరాబాద్‌లో కానిస్టేబుల్ అరెస్టు

Constable Arrest in Hyderabad : కారులో ఒంటరిగా ఉన్న యువతీ యువకుల వీడియో తీసి వారిని బెదిరించి ఓ కానిస్టేబుల్ వారి నుంచి రూ.30వేలు తీసుకున్నాడు. అంతేగాక ఆ యువతితో అసభ్యకరంగా మాట్లాడి వేధించాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అతనికి సహకరించిన హోం గార్డును అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు.. హోంగార్డును తీసేసినట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు.

Constable Arrest in Hyderabad
Constable Arrest in Hyderabad

By

Published : Apr 21, 2022, 8:22 AM IST

Constable Arrest in Hyderabad : కారులో ఒంటరిగా ఉన్న యువతీ, యువకులను వీడియో తీసి బెదిరించి వారి వద్ద నుంచి రూ.30వేలు తీసుకోవడమేకాక యువతిని వేధించినందుకు ఓ కానిస్టేబుల్‌ అతనికి సహకరించిన హోం గార్డును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బేగంపేట్‌ ఏసీపీ నరేశ్‌రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. పంజాగుట్టకు చెందిన ప్రవీణ్‌కుమార్‌(21) వృత్తిరీత్యా కెమెరామెన్‌. ఈనెల 15న కార్ఖానాలో జరిగిన ఓ వివాహానికి హాజరైన ప్రవీణ్‌కుమార్‌ స్నేహితురాలి(21)తో కలిసి కారులో న్యూబోయిన్‌పల్లికి వచ్చాడు. డెయిరీ ఫారం క్రాస్‌ రోడ్డులోని సర్వీసు రోడ్డులో కారు ఆపి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.

పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆకాశ్‌భట్‌.. వారు కారులో ఉండగా చిత్రీకరించాడు. పెట్రోకారులో అక్కడికి చేరుకున్న హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వీడియోలను మీడియాకి ఇవ్వడమేకాక కేసు నమోదు చేయిస్తామని బెదిరించారు. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి తన వద్ద రూ.15 వేలు ఉన్నాయని ప్రవీణ్‌కుమార్‌ ఫోన్‌పే చేశాడు. మిగతా డబ్బును మరుసటిరోజు బదిలీ చేస్తానని చెప్పడంతో వారిని వదిలేశారు. మరుసటి రోజున ఆకాశ్‌.. యువతికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేయగా, ఆమె రూ.15 వేలు గూగుల్‌ పే చేసింది. తనకు డబ్బులు వద్దంటూ.. ఆకాశ్‌ ద్వంద్వార్థంతో మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె ప్రవీణ్‌కుమార్‌కు చెప్పింది. ఈమేరకు ఈనెల 19న ఠాణాలో ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకాశ్‌, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆకాశ్‌భట్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోంగార్డును తీసేసినట్లు బేగంపేట్‌ ఏసీపీ నరేశ్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details