Attack on Coconut Street Vendor: మనిషి విచక్షణ కోల్పోతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అప్పటివరకూ కామ్‌గా ఉండి. ఒక్కసారిగా సైకోలా మారిపోవడం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. దురలవాట్లు, చెడు సహవాసాలు, తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇందుకు ఓ రకంగా కారణమే.. కొబ్బరి బోండాలు తాగాక డబ్బులు అడిగినందుకు బండి యజమానిపై దాడికి దిగారు కొందరు యువకులు. సినిమా స్టైల్లో రౌడీయిజం చేస్తూ.. కత్తులు, కర్రలతో దాడికి దిగారు.
కత్తులు, కర్రలతో దాడి
హైదరాబాద్ కూకట్పల్లి షంశీగూడ నాలా వద్ద కొంతకాలంగా నరేందర్ అనే వ్యక్తి కొబ్బరి బోండాల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం సాయంత్రం యువకుడు కుల్దీప్ సింగ్.. ఇద్దరు స్నేహితులతో రోడ్డుమీద వెళ్తూ.. దారిలో కొబ్బరి బోండాల బండి కనిపిస్తే ఆగారు. దగ్గరకు వెళ్లి బోండాలు తీసుకున్నారు. దాహం తీరేలా తాగారు. అనంతరం బండి యజమాని బోండాల డబ్బులు అడిగారు. ఇంతలో ఆ యువకులకు ఏమైందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ దాడికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోక రాధాకృష్ణ, హర్దీప్ సింగ్ అనే మరో ఇద్దరిని తీసుకొచ్చి ఘర్షణకు దిగారు.