swimmer died in car in the well accident: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద బావిలో పడిన కారును వెలికితీసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడు నర్సింహులు మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. మోటర్లతో బావిలోని నీటిని బయటికి తోడేసి.. క్రేన్ సహాయంతో పైకి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా బంధువులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు రావాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 6లక్షల పరిహారం, రెండు పడక గదుల ఇంటితో పాటు ఆయన భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్డీవో ఆనంతరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో బంధువులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు.
అసలేం జరిగిందంటే...
రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిలో చిట్టాపూర్, భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన బావి ఉంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకుమారుడు వేడుకలో పాల్గొని హుస్నాబాద్‌కు కారులో వెళ్తున్నారు. అప్పటివరకు వాళ్ల ప్రయాణం బాగానే సాగినా.. చిట్టాపూర్, భూంపల్లి మధ్య కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న ఓ స్థానికుడు చూశాడు. రోడ్డు మీది నుంచి ఘటనా స్థలానికి వచ్చేలోపే కారు పూర్తిగా బావిలో మునిగిపోవటంతో ఏమీ చేయలేకపోయాడు. బావిలోనూ నిండుగా నీరు ఉండటం వల్ల అతడూ ఎలాంటి సాహసం చేయలేకపోయాడు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.