Chintamani Natakam Issue in AP: తరతరాలుగా తెలుగుజాతిని నాటకాలు అలరిస్తున్నాయి. ఎన్నో సాంఘిక దురాచారాలపై ప్రజలను నాటకరంగం చైతన్యం చేసింది. అలాంటి నాటకాల్లో చింతామణి ఎంతో పేరు గాంచింది. వేశ్యల కారణంగా ఎంతగొప్పవారైనా... ఏ విధంగా రోడ్డునపడతారు? కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయని కళ్లకు కట్టిన సాంఘిక నాటకమే చింతామణి. దాదాపు వందేళ్లకు పైగా లక్షల ప్రదర్శనలకు నోచుకున్న ఈ నాటకంలో అశ్లీలత ఉందన్న ఆరోపణలతో కొన్ని వివాదాలు చెలరేగాయి. కోర్టు కేసుల వరకు వెళ్లిన తర్వాత... నాటకంలో చాలా మార్పులు చేశారు. అశ్లీల సంభాషనలు తొలగించడంతోపాటు... కొన్ని పాత్రల పేర్లు మార్చడంతో ఇప్పటికీ ఈ నాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. చింతామణిలో... ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాటకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చింతామణి నాటకంపై నిషేధం.. ఏపీ వ్యాప్తంగా కళాకారుల ఆందోళనలు - చింతామణి నాటకం నిషేధం వార్తలు
Chintamani Natakam Issue in AP: కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. ఎన్నో ఏళ్లుగా తెలుగువారికి దగ్గరైన నాటకం... ఎందరినో చైతన్యవంతులను చేసింది. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలపై సమరం చేసింది. అలాంటి నాటకాల్లో ఒకటైన చింతామణి నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై నాటకరంగ కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 35 వేల మంది కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. కనుమరుగైపోతున్న నాటకరంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం.. నిషేధం విధించడంపై కర్నూలులో కళకారులు మండిపడ్డారు. చింతామణి నాటకం నిషేధం విధించడంపై విజయనగరంలో కళాకారులు ఆందోళనకు దిగారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరనస తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ కళాకారులు నిరసన తెలిపారు. ఒక పాత్ర కారణంగా నాటకాన్ని పూర్తిగా నిషేధించడం తగదన్నారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. చింతామణి నాటకంపై మరోసారి పునరాలోచించుకుని నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కళాకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:50 రోజుల 'అఖండ'.. రూ.200 కోట్ల వసూళ్లు