‘వారం రోజుల నుంచి మా కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వేధిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో తక్కువ మంది విధులు నిర్వహిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. నీతో ఒంటరిగా మాట్లాడాలి.. నేను చెప్పిన సమయానికి రాకపోతే నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ రెండురోజుల కిందట చెప్పాడు. స్పందించకపోవడంతో తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా నా ఫొటో ఫేస్‌బుక్‌లో ఉంచి అసభ్యంగా ప్రచారం చేశాడు. నేను ఫిర్యాదు ఇస్తా.. అతడిని శిక్షించండి.’
కొద్దిరోజుల కిందట భరోసా కేంద్రానికి వచ్చిన యువతి పోలీసులతో అన్నమాటలివి. వెంటనే స్పందించిన ‘షి’బృందం సభ్యులు గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్నారు. ఆమెను వేధించిన యువకుడికి పోలీసు శైలిలో బుద్ధి చెప్పారు. మరోసారి బాధితురాలి జోలికి రాకుండా అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసులు స్పందిస్తుండటంతో కళాశాలలు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహిళలు నేరుగా భరోసా కేంద్రాలకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వీరు నేరుగా వస్తున్నా.. బాధితులకు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.
మీ స్పందన నేరాలకు అడ్డుకట్ట
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే స్పందించాలి. మిమ్మల్ని వేధిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకోండి. మీ స్పందన ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈవ్ టీజింగ్ బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. మీ ఆవేదనను ‘షి’బృందాలకు చెప్తే చాలు... చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. బాధితులకు మేం భరోసా ఇస్తున్నందుకే ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి.