హైదరాబాద్‌లో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే రాష్ట్రంలో మరొకటి చోటుచేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. మల్కాజిగిరి సీసీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌పై నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ప్రేమించి.. పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ యువతి, సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎస్సై ధరావత్ విజయ్‌లు కాలేజీ రోజుల(గత పదేళ్లుగా) నుంచి ప్రేమించుకుంటున్నారు. దూరపు బంధువులు, ఒకే కులానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్ యువతితో సహజీవనం చేశాడు. తీరాచూస్తే ఆరేళ్ల క్రితం విజయ్ తన మేనమామ కూతురుని వివాహం చేసుకున్నాడు. (వారికి ఒక కుమారుడు ఉన్నాడు.) తన పరిస్థితి ఏంటని బాధిత యువతి ప్రశ్నిస్తే.. భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. ఆరేళ్ల నుంచి అదే సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.
బాధిత యువతిని వదులుకోవడం ఇష్టం లేదని చెబుతూ.. ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలనూ చెడగొడుతున్నాడు. ఇటు భార్యతో కాపురం, యువతితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని.. పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి విజయ్‌ను కోరింది. అతను మళ్లీ పాత సమాధానాలే చెబుతూ.. దాటవేస్తుండటంతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేశాడని విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.