తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రియుడు.. ప్రియురాలు.. 2 ఉంగరాలు! - hyderabad latest updates

ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని దుండిగల్ పీఎస్​లో చోటు చేసుకుంది.

crime news of telangana
ప్రియుడు.. ప్రియురాలు.. 2 ఉంగరాలు!

By

Published : Apr 1, 2021, 8:31 PM IST

Updated : Apr 2, 2021, 6:31 AM IST

తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కొచ్చాడు. సూరారంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అతని బంధువైన వివాహిత ఐదు నెలల క్రితం నగరానికొచ్చింది. సుమారు నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలుసుకున్నారు. ఓ రోజు ఏకాంతంగా గడిపేందుకు దుండిగల్‌ ఠాణా పరిధి బహదూర్‌పల్లిలోని వెంచర్‌లోకి వెళ్లారు. అదే సమయంలో అటువైపు వచ్చిన కానిస్టేబుల్‌, ఎస్పీవో(స్పెషల్‌ పోలీసు అధికారి) కంటపడ్డారు. ‘స్టేషన్‌కు తీసుకెళ్తే పరువు పోతుంది. ఇక మీ ఇష్టం’ అంటూ ఆ జంటను ఇద్దరూ బెదిరించారు. ఇప్పుడు డబ్బుల్లేవని, తర్వాత స్టేషన్‌కొచ్చి ఇస్తానని ఆ యువకుడు వేడుకున్న మీదట ‘డబ్బులిచ్చి తీసుకెళ్లమంటూ అతని చేతికి ఉన్న రెండు ఉంగరాలను’ బలవంతంగా తీసుకున్నారు.

కేసు నమోదు..ఆపై కొట్టివేత

అనుకోని ఈ పరిణామాలతో బిత్తరపోయిన యువకుడు ఆమెను పంపించేసి, తాను ఇంటికి వెళ్లేందుకు ఉపక్రమిస్తుండగా అటువైపుగా పోలీసు డయల్‌ 100 వాహనం వచ్చింది. అందులో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌కు యువకుడు జరిగిందంతా చెప్పాడు. ఆయన తాను పనిచేసే దుండిగల్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ బాధితుడిని ఠాణాకు తీసుకెళ్లారు. ఉంగరాలు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌, ఎస్పీవో మీద ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించాడు. ‘కేసు అవసరం లేదని, ఉంగరాలు ఇప్పిస్తే చాలంటూ’ యువకుడు ప్రాధేయపడ్డాడు. అయినా ఆ కానిస్టేబుల్‌పై సీఐ కేసు నమోదు చేశారు. ఎస్పీవోను విధుల నుంచి తొలగించారు. వారం రోజులు జైల్లో ఉన్న కానిస్టేబుల్‌ బెయిల్‌పై బయటికొచ్చాడు.

ఏపీపీపై ఒత్తిడి తెచ్చి మరీ

గతేడాది డిసెంబరులో దుండిగల్‌ పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. దుండిగల్‌ ఠాణా కోర్టు కానిస్టేబుల్‌, నిందితుడైన కానిస్టేబుల్‌ది ఒకటే ఊరు. దీంతో ఇద్దరూ కలిసి ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ(విచారణాధికారి)కి తెలియకుండానే అసిస్టెంబ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ)పై ఒత్తిడి తెచ్చారు. తమకు సహకరించేలా ఒప్పించారు. ఉంగరాలు ఎక్కడో పోయాయంటూ! బాధితుడితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. సాక్షులతోనూ అలాగే చెప్పించడంతో న్యాయస్థానం కేసును కొట్టేసింది.

ఉన్నతాధికారులకు తెలిసిందిలా

సాధారణంగా ప్రభుత్వోద్యోగిపై కేసు నమోదైతే శాఖాపరమైన విచారణ జరుగుతుంది. ఈ బాధ్యతను ఉన్నతాధికారులు పేట్‌బషీరాబాద్‌ ఏసీపీకి అప్పగించారు. విచారణలో బాధిత యువకుడు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఏసీపీ ఆ విషయాన్ని బాలానగర్‌ డీసీపీకి తెలిపారు. ఆయన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే కేసు కొట్టేశారనే సంగతి తెలుసుకున్న సీపీ తాజాగా సదరు కోర్టు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. అసిస్టెంబ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు లేఖ రాశారు. ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐను కమిషనరేట్‌కు అటాచ్‌ చేయాలని నిర్ణయించారు. అప్పీలు చేసి నిందితుడైన కానిస్టేబుల్‌కు శిక్షపడేలా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే అప్పీలు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

ఇదీ చదవండి:ఆ జట్టు​ నాకు ఇల్లు లాంటిది: ఉమేశ్ యాదవ్

Last Updated : Apr 2, 2021, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details