తెలంగాణ

telangana

ETV Bharat / crime

వేటపాలెం కో-ఆపరేటివ్ మోసం.. రూ.22 కోట్ల పైనే సొమ్ము స్వాహా - వేటపాలెం కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ వార్తలు

డిపాజిట్ దారుల సొమ్మును స్వాహా చేసిన కేసులో వేటపాలెం కో-ఆపరేటివ్‌ సొసైటీ మేనేజర్​, అధ్యక్షునితో పాటు డైరెక్టర్లను ఏపీలోని ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. క్రెడిట్ సొసైటీలో.. గడువు ముగిసినా డిపాజిట్ దారులకు సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో.. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.22 కోట్లపైనే సొమ్ము స్వాహా అయినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు.

వేటపాలెం కో-ఆపరేటివ్ మోసం
వేటపాలెం కో-ఆపరేటివ్ మోసం

By

Published : Jul 30, 2021, 10:24 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా వేటపాలెం కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో రూ.22 కోట్లపైనే సొమ్ము స్వాహా అయినట్లు విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. సొసైటీ కార్యదర్శి, అధ్యక్షుడితో పాటు డైరెక్టర్లను అరెస్ట్‌ చేశామన్నారు. గురువారం వేటపాలెం పోలీసుస్టేషనులో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈనెల 21 సొసైటీలో డిపాజిట్‌ చేసిన నగదు గోల్‌మాల్‌ జరిగిందని ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసి ఓఎస్‌డీ చౌడేశ్వరి, చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

1949లో ది వేటపాలెం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఏర్పాటవగా 1984లో కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీగా పేరు మార్పు చేశారని మలికా గార్గ్ వెల్లడించారు. ఫిక్స్‌డ్‌, రికరింగ్‌, సేవింగ్‌ ఖాతాల ద్వారా నగదును స్వీకరిస్తున్నారని తెలిపారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లు, కార్యదర్శి, మేనేజరుగా ఉన్న శ్రీరాం శ్రీనివాసరావుతో కుమ్మక్కై లావాదేవీల దస్త్రాలు పరిశీలించలేదని విచారణలో తేలిందన్నారు. ఏటా ఆడిట్‌ చేయడం లేదని వివరించారు.

సొసైటీలో 1330 ఫిక్స్‌డ్‌, 138 ఆర్డీలు, 850 సేవింగ్‌ ఖాతాల ద్వారా రూ.22 కోట్ల పైనే జమ అయినట్లు గుర్తించామన్నారు. ఇందులో దాదాపు రూ.5 కోట్లతో ఎల్‌ఐసీ బాండ్లు, భూములు, ఫ్లాట్లు, బంగారం కొనుగోలు చేసిన మేనేజరు, మిగిలిన సొమ్మును దాచిపెట్టారన్నారు. దీనికి అధ్యక్షుడితో పాటు డైరెక్టర్ల సహకారం ఉన్నట్లు విచారణలో తేలిందని.. వారి బ్యాంకు ఖాతాలు, లాకర్ల లావాదేవీలు నిలుపుదల చేయాల్సిందిగా మేనేజర్లకు సమాచారం అందజేశామని తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు వలివేటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వల్లంపట్ల రామలింగస్వామి, చిలంకూరి ఆంజనేయ గుప్త, కోడూరి రాజేంద్రప్రసాద్‌, నూనె మోహన కృష్ణ, కొలిశెట్టి వెంకట సత్యనారాయణ, రాయవరపు శ్రీనివాసరావుల ఆస్తులను చట్టప్రకారం జప్తు చేయడానికి సిఫార్సు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఓఎస్‌డీ, డీఎస్పీలతో పాటు చీరాల గ్రామీణ సీఐ రోశయ్య, ఎస్సై కమలాకర్‌ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details