Youth Fight in Hyderabad: పాత గొడవలు మనసులో పెట్టుకొని ఓ యువకుడిపై నడి రోడ్డుపై దాడికి దిగాడు మరో యువకుడు. అంతటితో ఆగకుండా కిడ్నాప్‌నకూ ప్రయత్నించాడు. అతనికి మరో 15 మంది సహకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన జయరాం ఇంటర్ పూర్తి చేసి గుజరాత్‌లోని వడోదర యూనివర్సిటిలో ఇంజినీరింగ్‌లో చేరాడు. ఏడాది చదివిన అనంతరం చదువు మానేసి అక్కడి నుంచి వచ్చేశాడు. ఖమ్మంలో ఇంటర్ చదువుతున్న సమయంలో శ్రీరామ్ అనే యువకిడికి, ఇతనికి పలుమార్లు గొడవలు అయ్యాయి. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదువు కోసం జయరాం గుజరాత్ వెళ్లిపోయాడు.
అదే కళాశాలలో చదివేందుకు శ్రీరామ్ కూడా తర్వాతి ఏడాది గుజరాత్ వెళ్లాడు. అక్కడ శ్రీరామ్‌ను గమనించిన జయరాం గుజరాత్‌లోని మిత్రులతో కలిసి దాడి చేశాడు. దీంతో అక్కడి నుంచి శ్రీరామ్ చదవు మానేసి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. చదువు మధ్యలో మానేసిన జయరాం కూడా స్నేహితులు కౌశిక్, అభిలాష్‌తో కలిసి నార్సింగిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. విదేశాల్లో చదివేందుకు ఈ ముగ్గురూ ఐఎల్స్ ప్రిపేర్ అవుతున్నారు.
జయరాం హైదాబాద్‌లో ఉంటున్నాడని తెలుసుకున్న శ్రీరామ్.. అతనికి ఫోన్ చేసి పలుమార్లు బెదిరింపులకు దిగాడు. దీంతో ఇద్దరికీ స్నేహితుడిగా ఉన్న ప్రీతంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. గొడవలు వద్దని తాను చూసుకుంటానని ఇద్దరిని మాట్లాడేందుకు ప్రీతం పిలిచాడు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్దకు ఇద్దరినీ రమ్మన్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి పంజాగుట్టకు జయరాం చేరుకున్నాడు.
జయరాంను అక్కడే ఉన్న శ్రీరామ్, అతని స్నేహితులు అడ్డుకున్నారు. 15 మంది కలిసి దాడికి దిగారు. చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే డయల్ 100 ద్వారా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటుగా వెళ్తున్న ఓ మహిళ ధైర్య సాహసాలతో ఈ దాడిని అడ్డుకుంది. జయరాంను కారులో ఎక్కించేందుకు నిందితులు ప్రయత్నించగా.. ఇంతలో పంజాగుట్ట గస్తీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన శ్రీరామ్.. అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలు కావడంతో స్నేహితులతో కలిసి ఆస్పత్రిలో బాధితుడు చికిత్స చేయించుకున్నాడు. దాడి చేసిన వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 15 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లో యువకుల మధ్య గొడవ ఇవీ చదవండి: