Drugs gang arrest: రాష్ట్రాన్ని డ్రగ్స్‌రహితంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న పోలీసులు.... హైదరాబాద్‌లో మరింత కఠినంగా వ్యహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న మూడు ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలో ఉంటూ పలు రాష్ట్రాలకు మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న నైజీరియన్ టోనీ.... హైదరాబాద్‌లోనూ ఏజెంట్లను నియమించుకున్నాడు. ఈ ముఠాపై డెకాయి ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు.... తమకు డ్రగ్స్ కావాలంటూ ముంబయిలో ఉన్న వారిని సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు తీసుకొని హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు... నైజీరియన్ టోనీ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకొని డ్రగ్స్ దందా సాగిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి ఎల్ఎస్డీ టాబ్లెట్లు తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడుగురు అంతర్ రాష్ట్ర ముఠాలకు చెందిన వారి నుంచి 16లక్షల రూపాయలకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపైనే ఉక్కుపాదం మోపిన పోలీసులు... మానవీయ కోణంలో ఆలోచిస్తూ... వినియోగదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తుండేవారు. నగరంలో డ్రగ్స్ వినియోగం క్రమంగా పెరుగుతుండటంతో ఇకపై తమ పంథాను మార్చుకున్నారు. డిమాండ్ తగ్గిస్తే... సరఫరా తగ్గుతుందనే భావనతో తరచూ డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడే వాళ్లపైనా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించేందుకు యోచిస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన వారి నుంచి వినియోగదారుల వివరాలు సేకరించి... వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.