అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట తండ్రే కాలయముడైయ్యాడు. భార్యపైన కోపం పిల్లలపై చూపి.. వారిని నిర్దాక్షిణ్యంగా బావిలో పడేసి హతమార్చాడు. తానూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశం ఓ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
సంతోషంతో బైక్‌పై ఎక్కిన చిన్నారులు..
ఉదయం వరకూ నవ్వుతూ తుళ్లుతూ ఉన్న ఈ పసికందుల ప్రాణాలు మధ్యాహ్నానికే గాల్లో కలిసిపోయాయి. పెంచి పెద్ద చేసి.. ప్రయోజకులను చేయాల్సిన కన్నతండ్రే వారి పాలిట కసాయిలా మారాడు. బయటకు తీసుకువెళతానన్న తండ్రితో సంతోషంగా బైక్ ఎక్కారు. కానీ కన్న తండ్రే తమను హతమార్చడానికి తీసుకువెళతాడని పసిబిడ్డలకేం తెలుసు. అసలా ఊహే వచ్చే వయస్సు కూడా కాదు వారిది. నమ్మి నాన్న వెంట అమాయకంగా వెళితే అత్యంత దారుణంగా బావిలోకి పడేసి చంపేశాడు. పట్టుమని పదేళ్లు కూడా దాటక మునుపే నిండు నూరేళ్లు నిండిపోయిన ఈ చిన్నారుల మృతి అందరినీ కలచివేసింది.
భార్యభర్తల మధ్య గొడవ.. క్షణికావేశంలో నిర్ణయం
క్షణికావేశం.. భార్యభర్తల మధ్య గొడవలు.. భర్త పిల్లలను బలిగొన్న ఘటన.. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన శిరీష, రామ్ కుమార్‌లకు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. రామ్‌కుమార్ ముంబయిలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల పాప అమీ జాక్సన్ (6), మూడేళ్ల బాబు జూని బెస్టో(3) ఉన్నారు. మూడు రోజుల క్రితమే రామ్‌కుమార్ ముంబయి నుంచి స్వగ్రామానికి వచ్చారు.
ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన భార్య
ఆర్ధికపరమైన ఇబ్బందులతో భార్యభర్తల మధ్య ఇటీవల కాలంలో తగాదాలు ఎక్కువయ్యాయి. ఇంటి ఖర్చుల నిమిత్తం పైసా ఇవ్వకపోవడం తన 7 తులాల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టడం, తనకు తెలియకుండా రూ.15 లక్షల బ్యాంకులోను తీసుకోవడంతో... డబ్బేం చేస్తున్నావంటూ శిరీష భర్తను నిలదీసింది. ఇదే విషయమై మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో భార్య వెంటనే పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య నిలదీయడాన్ని సహించలేని రామ్‌కుమార్.. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను తీసుకొని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని శివారులో ఉన్న తన వ్యవసాయ బావిలో తోసి పరారయ్యాడు. తల్లి, కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు అందరూ పిల్లల కోసం వెతకగా.. వ్యవసాయ బావిలో విగతజీవులై పడిఉన్న బిడ్డలు కనిపించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్, సిబ్బందితో వచ్చి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులతో పాటు తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల మధ్య గొడవలు.. అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లలను బలిగొంది. మేమేం తప్పు చేశామంటూ ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఆ చిన్నారులను చూసి కంట తడిపెట్టని వారు లేరు.
ఇదీ చూడండి: