తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నల్గొండ పట్టణం టూటౌన్ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్‌లో రెండిళ్లలో చోరీలు జరిగాయి. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడిన దొంగలు 15.5 తులాల బంగారం, రూ. 9.81 లక్షల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు.
కుమారుడిని విదేశాలకు పంపడం కోసం..
శ్రీలక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస చారి... సూర్యాపేట జిల్లా పరిషత్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడిని విదేశాలకు పంపడం కోసం.. 9.76 లక్షల నగదు, 14.5 తులాల బంగారం సమకూర్చుకున్నాడు. అతని భార్య నిన్న మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి.. నల్గొండలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం వచ్చి చూసేసరికి కూడబెట్టినదంతా దొంగలు దోచుకుపోయారు.
మరో ఘటనలో మీరు బాగ్ కాలనీలోని పైజల్ యూన్నీసా... నల్గొండ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న తన కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఇంట్లోకి చొరబడిన దొంగలు తులం బంగారం, రూ.5వేలు నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వరుస చోరీలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు... పోలీసులకు ఫిర్యాదు