Money Laundering with shell companies : డొల్ల కంపెనీలు.. వాటికి చైనా నుంచి పెట్టుబడులు. చైనీయులతో పాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు పెట్టారు. వాటిద్వారా ఏటా రూ.వందల కోట్ల టర్నోవర్ జరిగినట్లు చూపారు. అలా భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఏపీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) వర్గాలు విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై విచారణ మొదలైంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...
చైనా కంపెనీల మాటున...
దేశంలో 500 వరకు డొల్ల కంపెనీలను చైనీయులు రిజిస్టర్ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ మంత్రిత్వశాఖ ఒక రహస్య జాబితాను పంపినట్లు సమాచారం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 12, కర్ణాటకలో 197... ఇలా ఇంకా తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ బోగస్ కంపెనీలు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో అలీబాబా ప్రాజెక్ట్స్ డాట్ కామ్ (అమలాపురం), అలీబాబా కామర్స్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తిరుపతి), డెన్సిటింగ్ ప్రెసిషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (విశాఖపట్నం), సీఈటీసీ రెన్యువబుల్ ఎనర్జీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (చిత్తూరు జిల్లా, శ్రీసిటీ) కంపెనీలను ఆర్‌వోసీ వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రలో ఆయా కంపెనీల ప్రస్తుత, పూర్వ డైరెక్టర్లు 11 మంది, వారికి తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చిన 10మంది కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్ అకౌంటెంట్లపై ఆర్‌వోసీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
నాగవెంకట సత్యరామకృష్ణ వక్కపట్ల, సూర్యనారాయణ వక్కపట్ల (అమలాపురం), పందికుప్పం సుజని (తిరుపతి), చిన్న త్యాగరాజన్ (చిత్తూరు), సయ్యద్ షారిబ్ అబ్బాస్ రిజ్వీ (అలహాబాద్), జియాన్‌చో యాంగ్, జిన్ జియో, డలియాంగ్ జౌ, కివయాన్ కో (చైనా), ఉషా సీతారామ్ (చెన్నై), చంద్ర కుదిరి (నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట) డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ కుట్రకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి అవసరమైన ధ్రువీకరణలను ఇచ్చిన కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు జనార్దన్‌రెడ్డి, కృష్ణయ్య చెరువు (హైదరాబాద్), మాచర్ల రోశయ్య, దండపాణి (చెన్నై), మనిషేక్ మిత్తల్, రజని కోహ్లీ (దిల్లీ), వందనా లాల్‌వానీ (జైపూర్), కాకుటూరు భార్గవ్‌తేజ, చిన్ని శ్రావణ్‌కుమార్ (నెల్లూరు)లపై పోలీసులు కేసు నమోదుచేశారు.