Child Sexual Abuse: మహానగరంలో నిత్యం ఏదో మూలన బాలికలపై అఘాయిత్యం, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే పసిపిల్లలను కాటేస్తున్నారు. కొందరు లైంగిక దాడులను వీడియోలుగా తీసి బాలికలను బెదిరిస్తున్నారు. ఈ వికృతాలపై గణాంకాలు పరిశీలిస్తే పరిచయస్థులు/బంధువులే ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
- ఆ ఇద్దరు ఆడపిల్లలకు అమ్మ దూరమైంది. కడుపులో పెట్టుకుని సాకాల్సిన తండ్రిలో వికృత రూపం బయటపడింది. మద్యం మత్తులో పెద్దకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యం బారినపడటంతో బంధువులు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించాక అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ సీఐ కె.కనకయ్య ఆ ఇద్దరు పిల్లల్ని సంరక్షణ కేంద్రంలో చేర్చి ఆలనాపాలనా చూస్తూ మానవత్వం చాటుకున్నారు.
- రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్.. ఇంటిపై భాగంలో అద్దెకు ఉంటున్న కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఎవరూ లేనప్పుడు వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక తల్లి ఇంటికి రావటంతో దారుణం వెలుగు చూసింది. శంకరంపల్లి పోలీసులు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.
దాడులు.. బెదిరింపులు
గతేడాది ఎల్బీనగర్‌లో మానవ మృగం పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హతమార్చటం సంచలనం రేకెత్తించింది. బంజారాహిల్స్‌లో ఒక మహిళ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంపై తాజాగా కేసు నమోదైంది. లాక్‌డౌన్ సమయంలో పిల్లలపై అఘాయిత్యాలు మరింత పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.