‘‘సైదాబాద్ ఠాణా పరిధిలోని ఒక బస్తీలో పదిహేనేళ్ల బాలిక తల్లిదండ్రులతో నివాసముంటోంది. ఇంటి పక్కనే ఉన్న 16ఏళ్ల బాలుడు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ భయపెట్టి... పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. మూడు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బాలుడిని సంరక్షణ గృహానికి తరలించారు.’’
‘‘పాతబస్తీలోని ఓ ఠాణా పరిధిలోని ఓ ప్రాంతంలో తండ్రి మద్యం మత్తులో రెండు రోజుల క్రితం పన్నెండేళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు మహిళలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.’’
నగరంలో 24 గంటల వ్యవధిలో జరిగిన సంఘటనలివి. సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం సంచలనం సృష్టించింది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా.. చిన్నారులు, మైనర్లపై ఎలాంటి కనికరం లేకుండా కామాంధులు.. దుర్మార్గులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పరిచయస్థులు, బంధువులు... చివరకు ఇంట్లోవారే వావివరుసలు చూడకుండా లైంగిక దాడులు చేస్తున్నారు.
కొద్దిరోజులు హడావుడి
లైంగికదాడుల నుంచి చిన్నారులను రక్షిస్తామంటూ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. గల్లీలు, కాలనీలు, కమ్యూనిటీలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. బ్లూకోల్ట్స్ పోలీసులు, సెక్టార్ ఎస్సైలు స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి మురికివాడలు, పాఠశాలలు, వసతిగృహాలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చిన్నపాటి సభలను ఏర్పాటు చేస్తామని వివరించారు. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటన అనంతరం ఒకటి, రెండు రోజులు హడావుడి చేశారు. తర్వాత మర్చిపోయారు.
చాక్లెట్లు... బిస్కెట్లు... బెదిరింపులు
అమాయకులైన చిన్నారులకు ఖరీదైన చాక్లెట్లు, బిస్కెట్లు ఎరచూపించి వారి తల్లిదండ్రులు లేని సమయంలో కామాంధులు శరీరభాగాలను తాకుతున్నారు. అపరిచితులు, బంధువులతోపాటు ఎవరైనా ఎత్తుకున్నా... శరీర భాగాలను తాకినా పిల్లలకు తెలియడం లేదు. కౌమారదశలోని బాలికలకు మంచి, చెడూ స్పర్శలను తల్లిదండ్రులు చెప్పడం లేదు. వీరిపై కన్నేసిన కామాంధులు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడండి అంటూ పిలిచి గదుల్లోకి తీసుకెళ్తున్నారు. వారు ఆటల్లో లీనమైనప్పుడు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు. మరికొందరు కామాంధులు పిల్లలకు అశ్లీల వీడియోలు, అసభ్య ఫోటోలు చూపించి బలాత్కారం చేస్తున్నారు.
కూతురిపైనే అఘాయిత్యం.. కటకటాల్లోకి కసాయి
మద్యం మత్తులో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కసాయి తండ్రి. ఈ ఘటన మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ ఎన్.రవి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. జీవనోపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నగరానికి వచ్చి, మంగళ్‌హాట్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఇల్లు అద్దె తీసుకుని ఉంటున్నారు. హమాలీ పనిచేసే తండ్రి(42) మద్యానికి బానిసై నిత్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె(12)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.