Kid Strangled in Cradle at Sircilla: రోజూ పడుకునే ఊయలే ఆ చిన్నారికి ఉరితాడుగా మారింది. ఊయల తాళ్ల మధ్య మెడ ఇరుక్కుపోయి ఊపిరాడక ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందిన హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫనగర్‌లో మంగళవారం విషాదం నింపింది. ఈ గ్రామానికి చెందిన బండి దిలీప్, కల్యాణి దంపతులకు ఒక కుమారుడు(3 ఏళ్లు), కూతురు అయిరా(8 నెలలు) ఉన్నారు.
దిలీప్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ఇంట్లో పైఅంతస్తులో నివాసముంటోంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో దిలీప్ పడుకుని ఉండగా.. కూతురు అయిరాను తల్లి నైలాన్ తాడుతో చేసిన ఊయలలో పడుకోబెట్టి.. దుస్తులు ఉతకడానికి కింది అంతస్తుకు వెళ్లింది. టవల్‌లో పడుకోబెట్టిన అయిరా నిద్రలోంచి లేచి అటూఇటూ కదులుతున్న క్రమంలో తల నైలాన్ తాడు మధ్యలో ఇరుక్కుపోయింది. ఊపిరాడక అచేతన స్థితికి చేరుకుంది. దుస్తులు ఉతికిన అనంతరం తిరిగొచ్చిన తల్లి పాపను గమనించింది. నిద్రలో ఉందనుకున్న చిన్నారిలో కదలిక లేకపోవడంతో టవల్ తీసి చూశారు. శ్వాస రాకపోవడంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గంభీరావుపేట ఎస్సై మహేశ్ తెలిపారు.
పిల్లల కదలికలను గమనిస్తుండాలి..చిన్నపిల్లలకు ఊహ వచ్చేంతవరకు వారి కదలికలపై తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వెడల్పాటి కర్రతో తయారు చేసినవి, గాలి, వెలుతురు సక్రమంగా వచ్చే ఊయలను వాడాలి. వాటిపై నుంచి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తలగడ ముఖంపైకి రాకుండా చూడాలి. అనుకోని సంఘటనలతో చిన్నారులకు ఊపిరాడకపోవడాన్ని ‘ఆస్‌ఫిక్సియా’ అని అంటారు.- మురళీధర్‌రావు, పిల్లల వైద్యనిపుణులు, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్