మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్(కొన్ని ప్రాంతాల్లో) రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో నివసించే పలు తెగలను ‘చెడ్డీ గ్యాంగ్’(Cheddi Gang)గా పిలుస్తుంటారు. కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా కొన్ని రాష్ట్రాల పోలీసులు నామకరణం చేశారు. ఒక్కో ముఠాలో పది నుంచి పదిహేను మంది వరకు ఉంటారు. ఇలాంటి ముఠాల సంఖ్య వందల్లోనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బనియన్లు, చెడ్డీలు ధరించి.. చేతిలో రాడ్‌తో దొంగతనాలు చేస్తుంటారు. ఒక నగరాన్ని ఎంచుకుని ముఠా సభ్యులు విడివిడిగా రైళ్లల్లో అక్కడికి చేరుకుంటారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో లేదా ఖాళీ స్థలాల్లో తాత్కాలికంగా గుడారాలు వేసుకుంటారు. పగలు బిచ్చగాళ్లుగా లేదంటే ఇంటింటికి తిరిగి బొమ్మలు, దుప్పట్లు విక్రయిస్తుంటారు. ఆ సమయంలోనే ఇంటి బాల్కనీ/బయట ఆరేసిన దుస్తుల ఆధారంగా ఖరీదైన ఇళ్లను గుర్తిస్తారు. ముఠాలోని మహిళలు ఆ ఇంటిని పురుషులకు చూపిస్తారు.
ఒంటికి గ్రీజు లేదా నూనె
నిర్మానుష్య ప్రాంతాలు/కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేస్తారు. ఆ సమయంలో ఎవరైనా చూసినా.. ప్రతిఘటించేందుకు యత్నించినా దాడి చేసేందుకు వెంట రాళ్లను తీసుకెళ్తుంటారు. చోరీలకు వెళ్లే ముందు గ్రీజు లేదా నూనె ఒళ్లంతా పూసుకుంటారు. అందుకే.. ఒంటిపై బనియన్లను మాత్రమే ఉంచుకుంటారు. అలికిడి వినిపించకుండా ఉండేందుకు చెప్పులు నడుముకు కట్టుకుంటారు. ఎలాంటి తాళంనైనా చప్పుడు రాకుండా పగులగొడతారు. డబ్బులు, వెండి, బంగారు ఆభరణాలనే కాజేస్తారు. వాస్తవానికి వారికి వీటి విలువ తెలియదు. తులం బంగారాన్ని రూ.10 వేలలోపే రిసీవర్లకు విక్రయిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ చిక్కినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు బంగారు ఆభరణాలను మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ తదితర ప్రాంతాల్లోని రిసీవర్లకు చేరవేస్తుంటారు.
మళ్లీ ఆరు నెలలు
రెండు, మూడు చోట్ల చోరీలు(Cheddi Gang) చేసిన తర్వాత స్థానికులను పని ఇప్పించమని అడుగుతారు. ఆ క్రమంలోనే దొంగతనాల గురించి ఏమనుకుంటున్నారు.. పోలీసుల నిఘా పెరిగిందా..? అని తెలుసుకుంటారు. పోలీసుల నజర్ లేదని తెలిస్తే.. సభ్యులంతా విడిపోతారు. లారీలు, బస్సులు, రైళ్లల్లో గమ్యస్థానాలకు వేర్వేరుగా చేరుకుంటారు. వాటాలు పంచుకుని స్వస్థలాలకు వెళ్లిపోతారు. ఆరు నెలల నుంచి ఏడాది వరకు మళ్లీ ఆ నగరంవైపు చూడరు. ఒకరిద్దరు పోలీసులకు చిక్కినా.. మిగిలిన వారి గురించి చెప్పరు. చోరీలతో తమకెలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతుంటారని పోలీసులు వివరించారు.