నగరంలో సాయం పేరిట కేటుగాళ్ల వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్ వద్ద జాతీయ రహదారిపై వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉండే ఈ ఆరుగురు మహిళలు రోడ్లపై వచ్చిపోయే వాహనదారుల వద్ద ట్రస్టుల సేవా కార్యక్రమాల పేరిట వసూళ్లకు పాల్పడ్డారు.
గతంలో బోరబండకు చెందిన ఇద్దరు యవకులు ‘హైదరాబాద్ యూత్ కరేజ్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభాగ్యుల చిత్రాల్ని వాడుతూ పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ఓ పేద మహిళ శస్త్రచికిత్స కోసం పెద్దఎత్తున వచ్చిన విరాళాల ఖర్చుతో వీరి బండారం బయటపడింది. దాతల నుంచి వచ్చిన సొమ్ముని సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలడంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
సగానికిపైగా అనుమతుల్లేవ్..
హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 500 దాకా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అనాథ, వృద్ధాశ్రమాలున్నాయి. అయితే వీటిలో సగానికిపైగా అనుమతుల్లేనివే. కేవలం సామాజిక మాధ్యమాల వేదికగా నడిచే వాటి సంఖ్య వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ చాలావరకు ఆశ్రమాలు దాతల సహకారం, విదేశీ మిషనరీల నుంచి వచ్చే నిధులతో నడుస్తున్నాయి. వీటి నిర్వాహకులు దాతృత్వం ముసుగులో నెలకు రూ.లక్షల్లో వచ్చే సొమ్ముతో జేబులు నింపుకొంటున్నారు. డబ్బాలు పట్టుకుని కూడళ్లలో డబ్బులు వసూలు చేస్తున్న వారిలో నిజమైనదేదో, నకిలీదేదో తెలియని పరిస్థితి. దీంతో అసలు వ్యక్తులకు సాయం అందట్లేదు.