Chandanagar Murder Case Update: అనుమానం ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. అన్యోన్యంగా సాగుతున్న వారి సంసార జీవితంలో అనుమానమే యమపాశంలా మారింది. హైదరాబాద్ చందానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న నాగరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతని భార్య సూజాత, రెండో తరగతి చదువున్న ఏడేళ్ల కుమార్తె రమ్యశ్రీ, ఐదో తరగతి చదువున్న సిద్దప్పను హత్య చేశాడు. ముగ్గురిని హత్య చేసిన అనంతరం నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
పిల్లలపై కూడా కనికరం లేకుండా: పిల్లలు, భార్య నిద్రిస్తున్న సమయంలోనే భార్య టైలరింగ్ కోసం వాడే కత్తెరతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. కుమారుడిని పొత్తి కడుపులో, కుమార్తెను వీపు మీద, భార్యను మెడ, తలపై కత్తెరతో పొడిచి చంపినట్లు గుర్తించారు. మృతదేహాల స్థితిని బట్టి రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజులుగా నాగరాజు వాళ్లింటి తలుపు తీయకపోవడం, దుర్వాసన వస్తుండటంతో స్థానికులు కిటికీ తలుపులు పగులగొట్టగా ఇద్దరు పిల్లలూ నిర్జీవంగా పడి ఉన్నారు.
కత్తెరతో అందరినీ పొడిచి తాను కూడా..:దీంతో చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. నాగరాజు ఉరివేసుకుని ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడిఉన్నారు. మరో గదిలో భార్య సుజాత రక్తస్రావంతో మృతి చెంది ఉంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు ఉపయోగించిన కత్తెరను స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.