ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనిలో సెల్‌ఫోన్ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఆదోనిలోని రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా చరవాణులు చోరీ చేసే దొంగను సీసీ కెమెరా ఆధారంగా పట్టుకున్నామని వెల్లడించారు.
స్థానిక జీబీ కాంప్లెక్స్‌లో ఉన్న నినాయక స్టీల్ షాపులో గేవారామ్ అనే వ్యక్తికి చెందిన వీవో ఎక్స్-50 సెల్‌ఫోన్‌ను ఈ నెల 5న ఓ గుర్తుతెలియని యువకుడు దొంగతనం చేశాడు. దీనిపై బాధితుడు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్టీల్ షాపులో ఓ యువకుడు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను సేకరించారు. చోరీకి పాల్పడింది ఎస్కేడీ కాలనీకి చెందిన బి.వీరేష్‌గా గుర్తించి అరెస్టు చేశారు.