తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్(Telugu academy scam) కేసులోని నలుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 60కోట్ల రూపాయల డిపాజిట్లను మాయం చేసి నగదును ఎక్కడికి మళ్లించారనే విషయం తెలుసుకోవడానికి నిందితులను 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.
రిమాండ్‌కు నిందితులు
డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సహా ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్‌లను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏపీ మర్కంటైల్ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. యూబీఐలోని డిపాజిట్లను అక్కడికి మళ్లించారు. డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డిపాజిట్లను మాయం చేసినట్లు తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది.
సంతకం ఫోర్జరీ చేశారా..?
దీంతో డిపాజిట్ పత్రాల్లోని సంతకాలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డైరెక్టర్ సంతకాలు అసలైనవా.. లేకపోతే ఫోర్జరీ చేశారా అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో తేలిన అనంతరం... దర్యాప్తులో పురోగతి లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. డిపాజిట్లను మాయం చేశారని తెలుగు అకాడమీ ఫిర్యాదు చేయగా.... అధికారులు లేఖ రాయడంతోనే డబ్బులు చెల్లించామంటూ యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ చెబుతుండటంతో పోలీసులు రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరి వాటా ఎంత...?
60కోట్ల రూపాయల నగదును ఎక్కడికి మళ్లించారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుట్రలో భాగస్వాములైనందుకు ఏపీ మర్కంటైల్ ఛైర్మన్ సత్యనారాయణకు 6 కోట్లు ఇచ్చారు. మిగతా 54 కోట్లను ఎక్కడికి మళ్లించారనే విషయాన్ని సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. మస్తాన్‌వలీ ఒక్కడే ఈ డబ్బంతా తీసుకున్నాడా? లేకపోతే ఎవరెవరికి వాటాలు పంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రూ. 60కోట్లలో 6 కోట్లు మర్కంటైల్ సొసైటీకి పోను మిగతా 54కోట్లను పంచుకున్నారా? లేకపోతే ఇంకే బ్యాంకులోనైనా డిపాజిట్ చేశారా? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.