యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు అధికారులను సీసీఎస్ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు.. తెలుగు అకాడమీ డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకుకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. అకాడమీ అధికారులు రాసిన లేఖ చూపించడంతో.. డిపాజిట్లను ఇతర బ్యాంకుకు బదిలీ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అగ్రసేన్ బ్యాంకులో ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాల్లో నుంచి విడతల వారీగా కోట్ల రూపాయల డబ్బును విత్ డ్రా చేసుకొని ఎవరికి అప్పగించారనే విషయాన్ని సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమి రెడ్డి, అకౌంట్స్ అధికారి రమేశ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫిక్‌ను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులనూ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై.. బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో ఒకేసారి వీళ్లందరినీ పోలీసులు ఆరా తీశారు. తెలుగు అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే.. ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.