తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోలీసు ఆడిన దొంగాట.. చివరకు ఉద్యోగం ఊడెనంట

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించాల్సిన రక్షకభటుడు. కాసుల కక్కుర్తితో అడ్డదారి తొక్కాడు. లక్షలు కొట్టేసి పోలీసు బుర్రతో తప్పించుకోవచ్చని పథకం వేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. బాధితుడి ఫిర్యాదుతో అసలు బండారం బట్టబయలైంది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ అవినీతి బాగోతంపై అంతర్గత విచారణ జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో సదరు ఇన్‌స్పెక్టరే ఈ దొంగాట ఆడినట్లు తేలడంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ దేవేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసు ఆడిన దొంగాట
పోలీసు ఆడిన దొంగాట

By

Published : May 11, 2022, 8:12 AM IST

ప్రజల కోసం పనిచేయాల్సిన ఓ పోలీసు అధికారి కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. దొంగలను పట్టుకోవాల్సిన ఖాఖీయే.. దొంగాట ఆడి అందర్ని బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ నిజం నిప్పులాంటిదంటారుగా.. అది నిజమేనండోయ్. అందుకే ఈ దొంగ పోలీసు డ్రామా బయటపడింది. చివరకు ఉద్యోగం ఊడింది. అసలేం జరిగిందంటే..

హరియాణా-రాజస్థాన్‌ ప్రాంతాల్లో ఉండే మేవాత్‌ ముఠాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్లు రవాణా చేస్తున్న కంటైనర్‌ను ఎత్తుకెళ్లారు. బాధితులు పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌, పహాడీషరీఫ్‌ పోలీసులు ఫిబ్రవరి 22న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొన్న సమయంలో పోలీసులు వారి వద్ద ఉన్న వస్తువులను తీసుకున్నారు. అక్కడే సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మరింత ముందుకెళ్లాడు. దొంగిలించిన టైర్లను కొనుగోలు చేసిన బేగంబజార్‌కు చెందిన రిసీవర్‌ సెల్‌ఫోన్లు, బ్యాంకు డెబిట్‌కార్డులు, పిన్‌ నంబర్లు సేకరించాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ తీసుకున్నారని భావించిన నిందితుడు అడిగిన వివరాలన్నీ వెల్లడించాడు.

కొరియర్‌లో తిరుపతి చేరవేత :రిసీవర్‌ నుంచి తీసుకున్న డెబిట్‌కార్డు, పిన్‌నంబర్‌ వివరాలను కొరియర్‌ ద్వారా తిరుపతిలోని స్నేహితురాలికి పంపాడు. అక్కడి ఏటీఏం కేంద్రాల్లో విడతలవారిగా ఆమె రూ.5లక్షలకు పైగా విత్‌డ్రా చేసింది. నిందితుడు జ్యుడీషియల్‌ రిమాండ్‌ తరువాత బయటకు వచ్చి బ్యాంకు ఖాతా చేసుకొని.. బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అక్కడ ఇచ్చిన సమాచారంతో పోలీసులే తన డబ్బు కాజేశారనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన రాచకొండ సీపీ అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌, బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో పోలీస్‌ దొంగాట బట్టబయలైంది. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. పోలీసు అధికారిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసుల అంతర్గత విచారణలో ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్ దొంగాట అడినట్లు తేలింది. డీజీపీ ఆదేశాలతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ దేవేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులైనా సరే.. ఇలాంటి తప్పులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని మహేశ్ భగవత్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details