ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం ఆదివారం చేపట్టిన అన్వేషణ ముగిసింది. పులివెందుల రోటరీపురం వాగులో మురికినీరు తొలగించి అన్వేషణ చేశారు. యంత్రాలతో మట్టి తొలగించి గాలించినా ఫలితం దక్కలేదు. రోటరీపురంవాగును మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయుధాల కోసం రేపు సీబీఐ అధికారులు మళ్లీ అన్వేషించనున్నారు.
సునీల్ యాదవ్‌పై ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka murder case) కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు తీసుకెళ్లారు. పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. కాగా మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి, భార్య లక్ష్మి ఆరోపించారు. ఏపీ కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్‌ను చూసేందుకు వచ్చిన వారిని జైలు అధికారులు అనుమతించలేదు.
ఇంట్లో తనిఖీలు
వివేకా ఇంటి పరిసరాల్లో సీబీఐ అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.