తెలంగాణ

telangana

ETV Bharat / crime

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. అభిషేక్ అరెస్టు.. నెక్ట్స్ ఆ ప్రముఖులకే నోటీసులు!

Delhi liquor scam: దిల్లీ మద్యం ముడుపుల కేసులో జరుగుతున్న అరెస్టులు... రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలోని ప్రముఖులతో సంబంధాలు ఉన్న బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. మరికొందరు ప్రముఖులకు సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు.

Delhi liquor scam
Delhi liquor scam

By

Published : Oct 11, 2022, 7:22 AM IST

Updated : Oct 11, 2022, 7:32 AM IST

Delhi liquor scam:దిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు రాష్ట్రంలో సంచలనం రేపింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ను సీబీఐ అధికారులు ఆదివారం దిల్లీకి పిలిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట సోమవారం హాజరుపరిచారు. విచారణలో అభిషేక్‌ తమ ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా దాటవేశాడని.. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీబీఐ అధికారులు కోరారు. మూడు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై నిందితుడిగా ఉన్నాడు. ఆయన డైరెక్టర్‌గా ఉన్న రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థతోపాటు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌లో అరుణ్‌తోపాటు బోయినపల్లి అభిషేక్‌ కూడా డైరెక్టర్‌గా ఉన్నట్లు బయటపడింది.

దీంతో అభిషేక్‌ వ్యాపారాలు, కార్యకలాపాలపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. మనీశ్‌ సిసోదియా అనుచరుడు అర్జున్‌పాండేకు విజయ్‌ నాయర్‌ తరఫున మహేంద్రు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల నగదును అందజేశాడన్నది సీబీఐ అభియోగం. ఈ డబ్బులో కొంత పిళ్లైదని అనుమానిస్తున్నారు. ఈ కేసులో రామచంద్రన్‌ పిళ్లైని కాకుండా.. అనూహ్యంగా అభిషేక్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. బోయినపల్లి అభిషేఖ్‌కు రాష్ట్రంలో ఉన్న సంబంధాల దృష్ట్యా వ్యూహాత్మకంగానే సీబీఐ అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు. అభిషేక్‌ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఇప్పటికే సమాచారం సేకరించాయి.

ఎస్‌.ఎస్‌. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఎల్‌ఎల్‌పీ, మాస్టర్‌ సాండ్‌ ఎల్‌ఎల్‌పీ, వాల్యూకేర్‌ ఈస్తటిక్స్‌ లిమిటెడ్‌, నీయోవెర్స్‌ రియాల్టీ, అనూస్‌ హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌, అగస్తి వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ, జెయూస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అనూస్‌ ఎలక్ట్రాలిసిస్‌ అండ్‌ ఒబెసిటీ సంస్థలలో అతనికి భాగస్వామ్యం ఉందని ప్రాథమికంగా గుర్తించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్‌లోనూ సోదాలు జరిగాయి. పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులతో వ్యాపార భాగస్వామ్యం ఉందని బయటపడింది. అతని తరఫున అభిషేక్‌ కీలకపాత్ర పోషించాడని... దక్షిణాదికి చెందిన అనేక మద్యం సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు కూడగట్టాడన్నది దర్యాప్తు సంస్థల అనుమానం. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ వారంలోనే రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో రాష్ట్రం కేంద్రంగా మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆయన విదేశాల్లో ఉన్నారని, అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2022, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details