Robbery in Bank of Baroda: బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం. అనుకూలమైన పనివేళలతో.. ఒత్తిడి లేని బిందాస్ జీవితం. పండుగలు, పబ్లిక్ హాలిడేస్, వారాంతపు సెలవులు. ఇలా అనుకుంటూ ఎంతో హుషారుగా జాబ్లో చేరాడు ఆ ఉద్యోగి. ఇక రోజూ ఎంతో ఉల్లాసంగా కస్టమర్ల నోట్ల కట్టలను లెక్కపెట్టుకుంటూ.. అకౌంట్స్ అన్నీ ట్యాలీ చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వరిస్తూ ఉన్నాడు. కానీ ఇంతలోనే ఓ మాయదారి వ్యసనం అతడిని చుట్టుముట్టుంది. ఆన్లైన్ గేమ్స్. వీటి బారిన పడితే ఇక వాటి నుంచి బయటపడటం కష్టమే. మనోడు కూడా వీటికి బీభత్సంగా బానిసయ్యాడు. అంతే.. లాభాలు వస్తాయనుకున్న చోట తీరని నష్టాలు చవిచూశాడు. దీంతో అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. అంతే ఎంతటి మంచివాడినైనా డబ్బు ఇట్టే మార్చేస్తుంది అన్నట్లుగా.. రోజూ నోట్ల కట్టలు కళ్ల ముందే జిగేల్మని కనిపిస్తుంటే.. అతని మనసు ఊరుకోలేదు. తన అప్పులు తీరడానికి ఆ క్యాషియర్ ఉద్యోగమే దిక్కనుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ నోట్ల కట్టల వైపే అతని దృష్టంతా. ఎలాగైనా వాటిని కాజేయాలని చూశాడు.
తిన్నింటికే కన్నం: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని భావించాడేమో.. అందుకే తిన్నింటికే కన్నం వేయాలని పథకం వేశాడు. అందుకు సమయం కోసం ఎదురుచూశాడు. అదీ లక్షో రెండు లక్షలో అనుకుంటే పొరపాటే.. ఏకంగా పెద్దమొత్తానికే టార్గెట్ పెట్టుకున్నాడు. చడీచప్పుడు కాకుండా రూ. 22.53 లక్షలు బ్యాగులో సర్దుకున్నాడు. ఇక తప్పించుకోవడమే తరువాయి. మెల్లగా బయటకు వెళుతున్నానని మధ్యాహ్న సమయంలో డబ్బుతో సహా పరారయ్యాడు. హైదరాబాద్లోని ఓ బ్యాంకులో క్యాషియర్ నిర్వాకం ఇది.