వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా శిక్షణ ఎస్సై.. తనపై మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ పోలీస్ కమిషనర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైని సస్పెండ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఉండాల్సిన వ్యక్తి తప్పుగా ప్రవర్తించినందున క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సైని హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు హెడ్‌క్వార్టర్‌ను విడిచివెళ్లవద్దని ఆదేశించారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. నల్లబెల్లం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉందని, తనిఖీలకు వెళ్లేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని శిక్షణ ఎస్సైని శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి 11.38 గంటలకు పిలిచాడు. అక్కడి నుంచి తన సొంత వాహనంలో ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె శరీరాన్ని తాకుతూ.. దుస్తులను చింపివేసి, అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా, ఘటనపై ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై అదే స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను విచారణాధికారిగా నియమించారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్సైపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
14 రోజుల రిమాండ్
శ్రీనివాసరెడ్డిపై అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసులు మరిపెడ పీఎస్‌లో నమోదయ్యాయి. శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. అతన్ని మహబూబాబాద్ జైలుకు తరలించారు.
సన్మానం పొందిన కొద్దిగంటల్లోనే..
మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.12.40 లక్షల విలువ చేసే 120 క్వింటాళ్ల నల్లబెల్లం, నాలుగు క్వింటాళ్ల పటికను ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పట్టుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్రమార్కుల అరెస్టును చూపించారు. భారీ మొత్తంలో అక్రమ నల్లబెల్లం పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినందుకు ఎస్సైకి రివార్డు అందజేసి సత్కరించారు. ఇదే సమయంలో మహిళా శిక్షణ ఎస్సై ఫిర్యాదు చేయగా.. సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎస్సై తీరును పలు సంఘాల నాయకులు ఖండించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా కాంగ్రెస్ ధర్నా
దళిత మహిళా శిక్షణ ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరిపెడ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఘటనపై విచారణ జరిపి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచూడండి:TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !