MLC Patnam Mahender Reddy Audio Viral Case : వికారాబాద్ జిల్లా తాండూరు సీఐను దూషించిన వ్యవహారం తాండూర్‌లో అధికార పార్టీ నాయకుల మధ్య రచ్చ రేపుతోంది. ఈ వివాదంలో తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఐను దూషిస్తూ మాట్లాడిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహేందర్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 353, 504, 506 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే.. నాదంటూ.. పట్నం మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఐని దూషించాడంటూ మహేందర్ రెడ్డిపై ఆరోపణలు వస్తుండగా... అదంతా రోహిత్ రెడ్డి పనేనంటూ మహేందర్ రెడ్డి విమర్శిస్తున్నారు.
మహేందర్ రెడ్డి రియాక్షన్ : మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనకు నోటీసులిస్తే స్పందిస్తానని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. తాను సీఐతో మాట్లాడానని.. అతణ్ని తిట్టలేదని చెప్పారు. సీఐని తిట్టిన ఆడియో తనది కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస నేతలపై కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే ఇలా తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస టికట్ తనదేనని.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మహేందర్ రెడ్డి వెల్లడించారు.
పోలీసులు నాకు నోటీసులిస్తే స్పందిస్తా. పోలీసులు నోటీసులిస్తే కోర్టులో తేల్చుకుంటా. నేను సీఐతో మాట్లాడా.. కానీ తిట్టలేదు. సీఐని తిట్టిన ఆడియో నాది కాదు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కావాలని నాపై ఇలా చేస్తున్నారు. తెరాస నేతలపై కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే ఇలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస టికెట్ నాదే.. ఎమ్మెల్యేగా పోటీచేస్తా.
-- పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
రోహిత్ రెడ్డి అనుచరుల ఆందోళన :మరోవైపు.. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇందిరాచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు సీఐకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతణ్ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
అది నిరూపించండి :మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తాను ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని.. తన పక్కన ఉన్న వారిని రౌడీషీటర్లు అంటే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నిజంగానే తన పక్కన ఉన్న ఎవరిపై అయినా రౌడీషీట్ ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. తాండూరులో తెరాస జెండా మోపింది తానని చెప్పారు. తెరాసతోనే రాజకీయ అరంగేట్రం చేశానని వెల్లడించారు. పట్నం మహేందర్ రెడ్డి తెదేపా నుంచి తెరాసలో చేరారని.. ఆయన నిరాశ, నిస్పృహతో మాట్లాడుతున్నారని అన్నారు.
"వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. తెరాస హవాలోనూ నన్ను తాండూరు ప్రజలు గెలిపించారు. ఇటీవల జరిపిన సర్వేల్లో నాకే మొగ్గు వచ్చింది. వందశాతం తాండూరు టికెట్ నాదే. మహేందర్‌రెడ్డి పార్టీ మారతారా లేదా అనేది నాకు తెలీదు. నాకు మహేందర్‌రెడ్డి ప్రత్యర్థి కాదు.. ఆయనతో గొడవ అనవసరం. పోలీసులకు మా మద్దతుంటుంది."