తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సు డ్రైవర్​పై ఎమ్మెల్యే అనుచరుల హల్ చల్.. కేసు నమోదు - రంగారెడ్డి వార్తలు

ఎమ్మెల్యే వాహనానికి దారి ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్​ను దుర్భాషలాడిన ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదైంది. ఆదివారం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ రెడ్డి.. ఎమ్మెల్యే వాహనానికి దారి ఇవ్వలేదు. దీంతో బస్సుకు అడ్డంగా తమ వాహనాన్ని పెట్టి ఎమ్మెల్యే అనుచరులు డ్రైవర్‌ను బూతులు తిట్టారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు.

case-file-on-mla-followers
ఎమ్మెల్యే అనుచరులపై కేసు

By

Published : Nov 8, 2021, 4:39 PM IST

ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూఖ్​నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చల్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరులపై పలు సెక్షన్ల కింద (Cr. No 893/2021 u/s 341, 353, 506,290 r/w 34 IPC) కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..

తమ వాహనానికి ఆర్టీసీ డ్రైవర్ దారి ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ రెడ్డి.. ఎమ్మెల్యే వాహనానికి దారి ఇవ్వలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు బస్సుకు అడ్డంగా తమ వాహనాన్ని అడ్డుగా పెట్టారు. డ్రైవర్‌ను దుర్భాషలాడారు. ఈ ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

ఎమ్మెల్యే అనుచరులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధ కలిగించిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నందున్నే దారి ఇవ్వలేదని బస్సు డ్రైవర్ బీఆర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని డిపో ఉన్నతాధికారులకు తెలిపినట్టు కండక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై స్పందించారు. డ్రైవర్ బీఆర్ రెడ్డి, కండక్టర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు (Ts 09 FA 0809) డ్రైవర్​తో పాటు.. మరో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్​నగర్ ఎస్సై సుందరయ్య తెలిపారు.

ఇదీ చూడండి:ఆర్టీసీ బస్సు డ్రైవర్​పై ఎమ్మెల్యే అనుచరుల హల్ చల్... నెట్టింట్లో వైరల్‌

ABOUT THE AUTHOR

...view details