తనతో నిశ్చితార్థం చేసుకొని.. మరొకరిని పెళ్లి చేసుకున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ డ్రైవర్ కానిస్టేబుల్ (సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్) శశికుమార్(27)పై బాధితురాలు.. మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు దాఖలు చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.
వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామవాసి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ శశికుమార్‌తో 2019 నవంబరు నెలలో ఎంగేజ్‌మెంట్ జరిగిందని హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన బాధితురాలు.. కమిషన్‌కు వివరించారు. సంబంధం కుదుర్చుకున్న తరువాత రూ.5 లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది. నిశ్చితార్థం తరువాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని శశికుమార్ చెప్పాడని బాధితురాలు ఆరోపించారు. ఇదంతా జరుగుతుండగానే 2021 ఆగస్టు 26న శశికుమార్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయారు. హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీసు ఠాణా, నాగర్ కర్నూల్ పోలీసు ఠాణాలలో ఫిర్యాదు చేశానని.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాలని కమిషన్‌ను బాధితురాలు వేడుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది.