బైక్‌ను తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు జలసమాధి వేగంగా వెళుతూ కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాల్వలో పడిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరు గల్లంతయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక వద్ద కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా... కారులో ఉన్న నలుగురూ నీట మునిగారు. కారు డోరు తెరుచుకుని.. ముగ్గురు బయటకు వచ్చి ప్రాణాలను రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. ఒక్కరు మాత్రమే... సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ముగ్గురు నీటిలో మునిగిపోయారు. వీరిలో ఇద్దరు మృతదేహాలను కాల్వలోనుంచి వెలికితీయగా... మరొకరి ఆచూకీ గల్లంతైంది. మితిమీరిన వేగం.. ఓ ద్విచక్రవాహనం అడ్డురావడం...అది గమనించేలోగా కారు అదుపు తప్పడం.. ప్రమాదాలకు కారణాలైయ్యాయి.
లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన ఉపాధ్యాయురాలు
వరంగల్‌లోని వినాయక ట్రేడర్స్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది శ్రీధర్, విజయ్‌భాస్కర్, రాకేశ్‌లు క్షేత్ర పరిశీలన కోసం పర్వతగిరికి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో తీగరాజుపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సరస్వతి లిఫ్ట్ అడిగి కారు ఎక్కారు. కారు కొంకపాక వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
బయటకు వచ్చేందుకు యత్నం
కారు కాల్వలో పడిపోగానే అందులోంచి ముగ్గురు డోరు తీసుకొని చాకచక్యంగా బయటకు దిగారు. నీటి ప్రవాహ ఉద్ధృతిలోనూ కారులోంచి బయటికి రాగలిగారు. సాయం కోసం కేకలు వేశారు. వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో కాపాడేందుకు యత్నించారు. నీటి ఉద్ధృతికి ఎదురీదేందుకు బాధితులు విఫలయత్నం చేశారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందరూ చూస్తుండగానే ముగ్గురు నీటిలో మునిగిపోయారు. స్థానికులు రక్షించేందుకు చేసిన ప్రయత్నాల్లో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దురు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. రెండు మృతదేహాలను వెలికి తీశారు. కారు డ్రైవర్ రాకేశ్, శ్రీధర్, లిఫ్ట్ అడిగి వచ్చిన మహిళ సరస్వతి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముగ్గురి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆయన... బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్న సాగునీటి కాల్వలకు కంచె వేసి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి