వ్యాపార నిర్వహణ కోసం బాడుగ కారుల్లో ప్రయాణిస్తుంటే తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని సొంత వాహనంలో బయల్దేరినా వారికి మృత్యువు తప్పలేదు. అన్నదమ్ములైన వ్యాపారులను రహదారి ప్రమాదం పొట్టన బెట్టుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు, అన్నదమ్ములు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో వారి గుమస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి.సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్ రహదారిపై డివైడర్‌ను కారు ఢీకొనడంతోపాటు వంద అడుగుల దూరంలో ఉన్న సూచిక బోర్డు సిమెంటు గద్దెను బలంగా తాకి పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.
మొదటినుంచీ ప్రమాదాల భయమే..
అన్నదమ్ములు చెన్నై తదితర ప్రాంతాల్లో బంగారాన్ని కొనుగోలు చేసి ఆభరణాలు తయారు చేయిస్తుంటారు. వాటిని తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తుంటారు. వ్యాపార పనుల్లో భాగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పటికే ఈ ఇద్దరు సోదరులతోపాటు స్వయానా వారి పెద్దన్న నాగేశ్వరరావు ప్రయాణించే కార్లు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. అద్దె కార్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారి బంధువు ఒకరికి పెట్టుబడి పెట్టి కారు కొనుగోలు చేయించారని కుటుంబీకులు తెలిపారు. ఈ కారులో మంగళవారం పెద్దపల్లికి వెళుతుండగా ప్రమాదం జరగటంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటినుంచి బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే కానరాని లోకాలకు చేరారని రోదిస్తున్నారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నాలుగేళ్ల కిందట ప్రమాదంలో కుమారుడి మృతి
నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లి వస్తుండగా నాలుగేళ్ల కిందట రైలు ప్రమాదంలో చనిపోయారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తున్నారు. తన కుమారుడితో పాటు తమ్ముళ్లు ప్రమాదాల్లో మరణించడాన్ని జీర్ణించుకోలేక నాగేశ్వరరావు బోరున విలపిస్తున్నారు.